సాదాబైనామా రైతులకు బంపర్ ఆఫర్.. కొత్త రూల్స్ ఇవే.. ఇలా చేస్తే మీ పేరుతో రిజిస్ట్రేషన్..
Telangana govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదాబైనామా భూముల క్రమబద్దీకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
- Harishth Thanniru
- Published On : March 27, 2026 / 08:51 AM IST
CM Revanth Reddy
- సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ సులభతరం
- కొనుగోలుదారు అఫిడవిట్ సరిపోతుంది
- సాదాబైనామా రిజిస్ట్రేషన్లు.. కొత్త నిబంధనలివే..
Telangana govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదాబైనామా భూముల క్రమబద్దీకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. భూభారతి చట్టం ద్వారా వీటి పరిష్కారానికి మార్గం లభించినా.. అనేక అడ్డంకుల కారణంగా మోక్షం కలగడం లేదన్న వాస్తవాన్ని గమనించిన రెవెన్యూ శాఖ రెండు ప్రత్యేక ఉత్తర్వులు జారీ ద్వారా ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమం చేసింది. ఈ మేరకు జీవో నం. 76, 77లను రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి జారీ చేశారు.
జీవో నెం.76 ప్రకారం.. ఇకపై భూమి అమ్మకందారు నుంచి అఫిడవిట్ అవసరం లేదు. కొనుగోలుదారు సమర్పించే అఫిడవిట్ సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న లక్షలాది సాదాబైనామా దరఖాస్తులకు ఊరట లభించనుంది. భూమి అమ్మకందారు నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొనుగోలుదారు ఇచ్చే అఫిడవిట్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ మార్పుతో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. తప్పుడు సమాచారం, తప్పుడు పత్రాలు ఇస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తారు.
జీవో నెంబర్ 77 ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం మరింత ఊరట కల్పించింది. ముఖ్యంగా ఐదు ఎకరాల వరకు భూములపై ఉన్న సాదాబైనామా లావాదేవీలను పరిశీలించి, క్రమబద్దీకరించడానికి కలెక్టర్లకు అధికారం ఇచ్చారు.ప ఈ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. మరోవైపు.. ‘భూ భారతి’లో నమోదుకు ముందు ఎవరైనా అభ్యంతరాలు తెలిపేందుకు 30రోజులు గడువు ఉంటుంది. ఐదుఎకరాల్లోపు భూమి ఉన్న వారికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకున్న నాటికి గ్రామీణ ప్రాంతం అయి ఉండి ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసిపోయినా ఆ దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుగా జీవో నెంబర్ 77 జారీ చేశారు.
