TG Local Bodies Elections
TG Local Bodies Elections : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని మార్గదర్శకాలు జారీ చేసింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ రిజర్వేషన్లపై సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50శాతం మించకూడదని ప్రభుత్వ జీవోలో స్పష్టం చేసింది.
ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళ రిజర్వేషన్లను రొటేషన్ పద్దతిలో అమలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. రిజర్వేషన్ కేటాయింపునకు సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్య సర్వే (SEEPC 2024 జనాభా డేటా) ఆధారంగా ఉండాలని, సర్పంచ్ రిజర్వేషన్‌కు 2011 జనగణనతోపాటు SEEPC డేటా వినియోగించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. 100శాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేయాలని పేర్కొంది. రిజర్వేషన్లు ‘Descending Population Order’ ప్రకారం కేటాయింపు చేయాలని పేర్కొంది.
మునుపటి ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు/గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయరాదని, 2019 ఎన్నికల్లో అమలు కాని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగవచ్చునని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా వార్డు రిజర్వేషన్ల నిర్ణయం ఎంపీడీవో, సర్పంచ్ రిజర్వేషన్ల నిర్ణయం ఆర్డీవో ఆధ్వర్యంలో జరగాలని పేర్కొంది. ఎస్టీ రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి, తరువాత ఎస్సీ , బీసీలకు రిజర్వేషన్లు కేటాయింపు చేయాలని పేర్కొంది.
మహిళల రిజర్వేషన్ అన్ని కేటగిరీలలో ప్రత్యేకంగా లెక్కించి అమలు చేయాలని, గ్రామ పంచాయతీ/వార్డుల సంఖ్య తక్కువైతే మొదట మహిళలు, ఆ తరువాత లాటరీ పద్దతి ద్వారా కేటాయించాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. అమలుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎలక్షన్ అథారిటీలను ప్రభుత్వం ఆదేశించింది.