Indiramma Illu : రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో తొలి ప్రాధాన్యత వారికే.. క్లారిటీ ఇచ్చిన రేవంత్ సర్కార్
Indiramma Illu : రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో భాగంగా మొత్తం 100 నియోజకవర్గాల్లో (జీహెచ్‌ఎంసీ మినహాయింపు) నియోజకవర్గానికి 1,500 చొప్పున 1,50,000 ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- Harish Thanniru
- Updated on- May 30, 2026 / 08:54 AM IST
Indiramma Illu : రాష్ట్రంలోని నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే తొలి విడత కింద అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఇక రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి చర్యలు చేపట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో ఎంఎస్-22 జారీ చేసింది.
Also Read : Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు
రెండో విడతలో మొదటి విడతకు భిన్నంగా గుడిసెలు, రూఫ్ టాప్ లేని ఇళ్లు, గోడల దశల్లో నిలిచిపోయిన ఇళ్లకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించారు. రెండో విడత ఇండ్ల పంపిణీలో తొలి ప్రాధాన్యం వారికి ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో భాగంగా మొత్తం 100 నియోజకవర్గాల్లో (జీహెచ్‌ఎంసీ మినహాయింపు) నియోజకవర్గానికి 1,500 చొప్పున 1,50,000 ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. వీటిలో నియోజకవర్గానికి 500 చొప్పు 100 నియోజకవర్గాలకు కలిపి 50వేల ఇండ్లను రూఫ్ రీప్లేస్మెంట్, షెల్టర్ అప్ గ్రెడేషన్‌కు అవకాశం కల్పించనున్నారు. రాష్ట్ర రిజర్వ్ కోటా కింద మరో 50వేల ఇళ్లను (కొత్త ఇళ్లు 30వేలు, రూఫ్ రీప్లేస్మెంట్ కింద 20వేలు) కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వివిధ సర్వేల ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 15వేల కుటుంబాలు గుడిసెల్లో నివసిస్తున్నారు. అయితే, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లలో వీరందరికీ మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇళ్లు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. దీనికితోడు గోడలు, స్లాబుల దశల్లో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసుకునేందుకు రూ.2లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. గెజిటెడ్ అధికారులతో అర్హుల ధ్రువీకరణ.. ఆ తరువాత జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తరువాతనే లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేస్తారు.
