Telangana Govt : పాఠశాలలు, కళాశాలల్లో రేపటి నుంచే విద్యార్థులకు బ్రేక్‌పాస్ట్ పథకం.. తొలుత ఈ ఎనిమిది జిల్లాల్లో.. మెనూ ఇదే..
Telangana Govt : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఈనెల 15వ తేదీ నుంచి బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్నారు. తొలుత ఎనిమిది జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
- Harish Thanniru
- Updated on- June 14, 2026 / 08:17 AM IST
Telangana Govt breakfast scheme
- రేపటి నుంచి తెలంగాణలో బ్రేక్ ఫాస్ట్ పథకం
- ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, పాఠశాలల్లో అమలు
- తొలుత ఎనిమిది జిల్లాల్లో..
breakfast scheme : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి పున: ప్రారంభం కానున్నాయి. ప్రారంభం రోజునుంచే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో 15వ తేదీ (సోమవారం) నుంచి బ్రేక్ ఫాస్ట్ పథకానికి అధికారులు శ్రీకారం చుట్టనున్నారు.
తొలి విడతలో 8 జిల్లాల్లోని ( వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి) 1,269 పాఠశాలలు, 33 జూనియర్ కాలేజీల్లో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఈ విడతలో 1,44,610 మంది విద్యార్థులకు అల్పాహారం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22 లక్షల మందికి విడతల వారీగా విస్తరించనున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ, మిల్లెట్ ఇడ్లీ, పూరీ, బోండా, ఉప్మా తదితరాలు వడ్డించనున్నారు.
సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా విడతల వారీగా ఈ పథకాన్ని ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలు చేస్తారు. మొత్తం 33 జిల్లాల్లో 39చోట్ల సెంట్రలైజ్డ్ కిచెన్ల నిర్మాణానికి రూ.299.90 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో ఇప్పటికే ఉన్న ఏడు కిచెన్లను ఆధునీకరిస్తారు. మిగిలినవి కొత్తగా నిర్మించనున్నారు. అయితే, ఒక్కో కిచెన్ నిర్మాణానికి ప్రభుత్వం 70శాతం భరిస్తుంది.. మిగిలిన 30శాతం స్వచ్ఛంద సంస్థలు ఖర్చు చేయనున్నాయి.
ప్రస్తుతం ఎనిమిది జిల్లాల్లో బ్రేక్ పాస్ట్ పథకాన్ని హేరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్, మన్నా ట్రస్ట్ లు అమలు చేయనున్నాయి. మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ ఇవ్వనున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు 75 మిల్లీ లీటర్ల చొప్పున.. మిగిలిన తరగతుల వారికి 100 మిల్లీ లీటర్ల చొప్పున పాలు అందజేస్తారు.
ప్రధానోపాధ్యాయులకు పంపిన మెనూ ఇలా..
♦ సోమవారం : దోసె (2), చట్నీ, సాంబారు
♦ మంగళవారం : మిల్లెట్ ఇండ్లీ (2), సాంబారు
♦ బుధవారం : పూరీ (2), మిక్స్‌డ్ వెజిటబుల్ కుర్మా
♦ గురువారం : బోండా (2), చట్నీ, సాంబారు
♦ శుక్రవారం : ఇండ్లీ (2), చట్నీ, సాంబారు
♦ శనివారం : ఉప్మా, చట్నీ సాంబారు, (ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి విద్యార్థులకు 150 గ్రాముల చొప్పున, 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 200 గ్రాముల చొప్పున ఉప్మా అందిస్తారు)
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. సోమవారం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
