private School Fees
private School Fees : ప్రస్తుత కాలంలో పిల్లల స్కూల్ ఫీజులు తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారిపోతున్నాయి. నర్సరీ, ఎల్‌కేజీలకే లక్షలకు లక్షలు డొనేషన్లు, ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రైవేట్ స్కూళ్లలో తమ పిల్లలను చదివించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై చర్యలు చేపట్టింది. ఈ మేరకు స్కూళ్ల పరిస్థితి.. అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలు, అక్కడ అందున్న విద్యాబోధన తదితర అంశాలను, ఆ పాఠశాలకు సంబంధించి గత రికార్డులను బేరీజు వేసుకొని ఫీజులను నిర్ణయించేందుకు సర్కార్ సిద్ధమైంది.
తెలంగాణ వ్యాప్తంగా 11వేల ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. మరో నెల రోజుల్లో 2025-26 విద్యా సంవత్సరం ముగియనుంది. వచ్చే విద్యా సంవత్సరంకు సంబంధించి పలు పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభంకానున్నాయి. అయితే, కొన్ని పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ.. శాస్త్రీయంగా ఫీజులను నిర్ణయించే ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత మూడేళ్ల ఆదాయ, వ్యయాల వివరాలను సేకరించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
ప్రతి రెండేళ్లకోసారి 8శాతం మాత్రమే ఫీజు పెంచుకునేలా ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు ముమ్మరమైంది. ఎంఈవోలు, డీఈవోల ద్వారా ఏ స్కూళ్లో ఎంత ఫీజు ఉంది..? ఏఏ క్లాసులకు ఎంతెంత తీసుకుంటున్నారు..? అనే వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రైవేటు స్కూళ్లలో దేని ఆధారంగా బేస్ ఫీజులను నిర్ణయించాలనేదానిపై అధికారులు కసరత్తు చేశారు.
ఆయా స్కూళ్ల నిర్వహణ ఖర్చుల ఆధారంగానే స్కూళ్ల ఫీజులు ఉండాలని విద్యాశాఖ భావిస్తోంది. దీనికోసం గత మూడేళ్ల ఆడిట్ రిపోర్టులు, టీచర్ల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ లెక్కల ఆధారంగానే ఒక బేస్ ఫీజును నిర్ణయిస్తారు. దానికి తగ్గట్టుగా తర్వాతి రెండేళ్ల ఫీజు డిసైడ్ చేయనున్నారు.
విద్యాశాఖపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు సంబంధిత సొమ్మును విద్యా సంస్థల నుంచి తిరిగి రాబట్టేలా చూడాలని నిర్దేశించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన సిఫార్సులను ప్రజాభిప్రాయం కోసం వెబ్‌సైట్‌లో ఉంచాలని సూచించారు.
మరోవైపు.. ఫీజుల నియంత్రణ పక్కాగా అమలు చేసేందుకు స్టేట్ లెవల్ ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని గానీ, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీనిగాని నియమించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఫీజుల నియంత్రణను చేపట్టాలని ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేపట్టింది.