Graduate MLC Voter : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం దరఖాస్తు చేస్తున్నారా? ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి..

Telangana Graduate MLC Voter Registration : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ అదేవిధంగా.. వరంగల్ - ఖమ్మం - నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటున్నారా? అయితే, మీరు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

Graduate MLC vote

Telangana Graduate MLC Voter Registration : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ అదేవిధంగా.. వరంగల్ – ఖమ్మం – నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటున్నారా? అయితే, మీ పేరు ఓటరు జాబితాలో ఉందని నిర్ధారించుకోవడంతో పాటు, ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఫారం-18ను సమర్పించాలని స్పష్టం చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దరఖాస్తులో ఆధార్, ఓటర్ ఐడీ నంబర్లు తప్పనిసరి కాదు! ఇంతకీ ఎవరు అర్హులు? ఎక్కడ దరఖాస్తు చేయాలి? చివరి తేదీ ఎప్పుడో తెలుసుకుందాం.

Also Read : Maharashtra : శివ శివా ఇదేం ఘోరం..! పూజ చేసుకునేందుకు వచ్చిన బాలికపై అసభ్యకర ప్రవర్తన.. వీడియో వైరల్.. నెటిజన్లు ఫైర్

తెలంగాణలోని రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఓటరు జాబితాలో పేర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఓటు హక్కు నమోదుకు నవంబరు 6వ తేదీ వరకు గడువు ఉంది. అయితే, ఓటు హక్కును ఎలా నమోదు చేసుకోవాలి.. ఎవరు అర్హులు..? ఫారం-18లో ఏఏ అంశాలను తప్పనిసరిగా నింపాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
♦ పట్టభద్రులుగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే.. 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ లేదా దానికి సమానమైన డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు పొంది ఉండాలి.
♦ గతంలో ఓటు హక్కు ఉన్నవారుకూడా ప్రస్తుతం కొత్తగా పట్టభద్రుల ఎన్నికల కోసం ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
♦ ఓటు హక్కు పొందాలంటే ఫారం-18 నింపాలి. ఇది తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌ http//ceotelangana.nic.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
♦ పూర్తి చేసిన ఫారం-18ను తహసీల్దార్ లేదంటే ఆర్డీవో కార్యాలయాల్లోని సహాయ ఓటరు నమోదు అధికారులు (ఏఈఆర్వోలు), నియమిత అధికారులకు సమర్పించాలి.
♦ దరఖాస్తుతో పాటు డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్, ప్రొవిజనల్ సర్టిఫికెట్ లేదంటే మార్కుల మెమోను చూపించాలి. సంబంధిత అధికారి వాటిని పరిశీలించి, ఫొటోకాపీని ధ్రువీకరిస్తారు.
♦ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ అందుబాటులో లేకపోతే, జిల్లాలోని గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన ఫొటోకాపీని జత చేయవచ్చు.
♦ ఉద్యోగుల విద్యార్హత పత్రాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నప్పుడు, సంబంధిత శాఖ గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించే అవకాశం ఉంది.
♦ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు లేదా ఇతర సంస్థల వద్ద అసలు సర్టిఫికెట్లు ఉన్న సందర్భాల్లో, ఆ పత్రాలు తమ వద్ద ఉన్నట్లు సంబంధిత సంస్థ ఇచ్చిన ధ్రువీకరణను సమర్పించవచ్చు.
♦ ఫారం-18లో ఆధార్ నంబర్, ఓటర్ ఐడీ (ఎపిక్) నంబర్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను మాత్రం నిబంధనల ప్రకారం సమర్పించాలి.
♦ ఆధార్, ఓటర్ ఐడీ వివరాలను ఇచ్చినప్పటికీ ఎన్నికల అధికారులు వాటిని బహిరంగపరచరు.
♦ అలాగే, ఒక వ్యక్తి రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం లేదు. అర్హత ఉన్నవారు తమకు వర్తించే ఒక్క నియోజకవర్గంలో మాత్రమే నమోదు చేసుకోవాలి.
♦ నవంబర్ 6వ తేదీ ఫారం-18 దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ.
♦ నవంబర్ 25వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ఉంటుంది.
♦ నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది
♦ డిసెంబర్ 30వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.
♦ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా, అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకుని ఫారం-18ను గడువులోగా సమర్పించడం మంచిది.