Telangana municipal elections: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్‌కు దారితీశాయి. ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చాలా సీరియస్‌గా ఫోకస్ చేసింది. ఎన్నికల సైరన్ మోగక ముందే..ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్‌కు మంత్రులను ఇంచార్జ్‌లుగా నియమించి..ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు చేశారు. ఎన్నికలు జరిగేంత వరకు సీరియస్‌గా ఫాలో అప్ చేయడంతో..మెరుగైన ఫలితాలు సాధించింది హస్తం పార్టీ.
కొన్ని చోట్ల హంగ్ వచ్చిన వాటిని కూడా నయానో బయానో తమ ఖాతాలోకి వేసుకోగలిగింది కాంగ్రెస్. కానీ హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీల్లో వచ్చిన రిజల్ట్స్ కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయట. తాము సీరియస్‌గా ఎంత ఫోకస్ చేసినా..హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో మరోసారి బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయడంతో..ఫలితాలు ఇలా ఎందుకు వచ్చాయని ఆరా తీస్తున్నారట హస్తం పార్టీ నేతలు.
Also Read: కొత్త జాబ్‌లోకి జేడీ.. ఇక పాలిటిక్స్‌కు గుడ్‌బై..! ఇక భవిష్యత్ అంతా..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కలున్న నియోజకవర్గాల్లో కూడా ఖాతా తెరవలేకపోయింది. గ్రేటర్ పరిధిలోని 23 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు పక్కనున్న చేవెళ్ల, మహేశ్వరం, మేడ్చల్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. దాంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక..గ్రేటర్ హైదరాబాద్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు హస్తం పార్టీ లీడర్లు.
రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు అన్ని అస్త్రాలను వాడుతున్నారు. హైదరాబాద్ విషయంలో పాలనా పరమైన సంస్కరణలు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైదరాబాద్‌ను విస్తరించి ఉన్న ఏరియాను కోర్..రిజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని ప్యూర్, మిగతా తెలంగాణ ప్రాంతాన్ని రేర్‌గా విభజిస్తూ..పరిపాలనకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు తోడుగా కొత్తగా ప్యూచర్ సిటీని డెవలప్ చేసే పనిలో పడింది.
హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై డీలా
హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై ఇంత ఫోకస్ పెట్టినా.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. ఎంతో గొప్పగా చెప్పుకునే ప్యూచర్ సిటీ ఏరియాలో ఉండే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. ఇక్కడ బీఆర్‌ఎస్ మెజారిటీ సాధించింది. ప్యూచర్ సిటీకి పక్కనే ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్‌గల్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ ఆధిక్యత ప్రదర్శించింది.
కానీ బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను తమవైపునకు తిప్పుకుని కారు పార్టీ నేతకు ఛైర్మన్ పోస్ట్ ఇచ్చి పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. అలాగే మేడ్చల్ జిల్లాలో ఉన్న మూడు మున్సిపాలిటీలు కూడా హస్తం పార్టీకి దక్కలేదు. మూడు చింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీలలో ఒక్క అలియాబాద్ మాత్రమే కాంగ్రెస్‌కు దక్కింది. మిగతా రెండుచోట్ల బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.
చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్‌లో మెజారిటీ లేకపోయినా..ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి పీఠాన్ని చేజిక్కించుకుంది కాంగ్రెస్. పటాన్ చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో కారు జోరు కాంగ్రెస్‌కు కంటిమీద కనుకు లేకుండా చేస్తోందట. ఇక పరిగి, వికారాబాద్ మున్సిపాలిటీలలో పూర్తిస్థాయి మెజారిటీ సాధించలేకపోయింది హస్తం పార్టీ.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే ప్రమాదం
హైదరాబాద్ చుట్టుపక్కల చాలాచోట్ల ఇప్పటికీ పట్టు సాధించకపోవడంతో హస్తం పార్టీ నాయకత్వం ఆలోచనలో పడిందట. ఇంత చేసినా..మున్సిపాలిటీల్లో ఇలాంటి ఫలితాలు రావడంతో..అసంతృప్తితో ఉన్నారట. సిటీ శివారు ప్రాంతాల్లో వచ్చిన ఫలితాల ఎఫెక్ట్..రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని భావిస్తున్నారట.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్ పార్టీని..హైదరాబాద్‌లో నాయకత్వం లేమి సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర నాయకత్వం ఒక ప్లాన్ చేస్తోందట. GHMC కాల పరిమితి ముగిసినా..ఆరు నెలల సమయం తీసుకొని..పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి..ప్రజల్లోకి వెళ్లాలనుకుంటుందట. ఆరు నెలల్లో పరిస్థితిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాతే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తోందట హస్తం పార్టీ.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి..ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి..మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. విభజిత జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఆరు నెలల తర్వాతే ఎన్నికలు పెట్టాలని చూస్తోంది. ఆరు నెలల తర్వాతైనా అధికార కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా.? లేక పరిస్థితులు అనుకూలంగా లేవని కార్పొరేషన్ ఎన్నికలపై మళ్లీ ఆలోచనలో పడుతుందా అనేది వేచి చూడాలి.