Representative Image (Image Credit To Original Source)
Iran Attack: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లోని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ బాంబు వచ్చి మీద పడుతుందోనని ప్రాణ భయంతో వణుకుతున్నారు.
ఇరాన్ చేసిన దాడుల్లో తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి గాయపడ్డాడు. అబుదాబి ఎయిర్ పోర్టుపై జరిగిన మిస్సైల్ దాడిలో సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రాజేశ్వరరావుకి తీవ్ర గాయాలయ్యాయి. కొంతకాలంగా అతడు దుబాయ్ ఎయిర్ పోర్టులో క్లీనింగ్ విభాగంలో పని చేస్తున్నాడె. ఇటీవల యూఏఈ ఎయిర్ పోర్ట్ పై ఇరాన్ మిస్సైల్ దాడి చేయగా అద్దాలు పగిలిపోయాయి. గాజు పెంకులు రాజేశ్వర్ రావు ఛాతి, కుడి చేతికి గుచ్చుకోవడంతో తీవ్ర గాయాలైనట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. రాజేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి పట్ల వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ తెలంగాణ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం ఇజ్రాయెల్ వెళ్లారు. ప్రస్తుతం ఆ దేశంలో యుద్ధం తారస్థాయికి చేరడంతో తెలంగాణ వాసుల కుటుంబాలు భయాందోళన చెందుతున్నాయి. ఇజ్రాయల్ లో ఉన్న తమ వారి క్షేమ సమాచారంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్, వీడియో కాల్స్ ద్వారా యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇజ్రాయల్ ప్రభుత్వం బంకర్లను ఏర్పాటు చేసినప్పిటికీ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని తెలంగాణ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.
అటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ వాసులు సైతం యుద్ధం కారణంగా ఆందోళనకు గురవుతున్నారు. ఆర్మూర్ నియోజకర్గంలోని సుమారు 4 నుంచి 5వేల మంది ఉపాధి కోసం ఇజ్రాయెల్ వెళ్లారు. ఆ దేశంలో యుద్ధం తారస్థాయికి చేరడంతో ఆర్మూర్ వాసుల కుటుంబాలు భయాందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్ లో ఉన్న తమ వారి క్షేమం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్, వీడియో కాల్స్ ద్వారా యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు.