Hyderabad: ఓయో రూమ్స్, హోటల్స్ కి వెళుతున్నారా.. ఇకనుంచి అవి తప్పనిసరి.. ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్
హైదరాబాద్(Hyderabad) లోని ఓయో రూమ్స్, హోటల్స్ పై ఆకస్మిక తనికీలు చేసిన తెలంగాణ పోలీస్ అధికారులు.
- V Santhosh Kumar
- Published on- June 6, 2026 / 07:26 PM IST
Telangana Police conducted surprise inspections on OYO rooms and hotels in Hyderabad
- ఓయో రూమ్స్‌పై పోలీసుల మెరుపు దాడులు.
- ఐడీ కార్డులు, నిబంధనలపై ప్రత్యేక నిఘా.
- నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిక.
Hyderabad: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను కాపాడటమే పరమావధిగా అక్రమ కార్యకలాపాలను అణచివేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నగరవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు, ఓయో రూమ్స్‌పై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్వయంగా ఉన్నతాధికారులే క్షేత్రస్థాయిలోకి దిగి నిఘా ఉంచడంతో నగరంలోని పలు ప్రాంతాలలో ఉన్న హోటల్ (Hyderabad)యాజమాన్యాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
Annamalai: అన్నామలై ‘వుయ్ ద లీడర్స్’ ఉద్యమం.. ఒక్కరోజులోనే 14 లక్షల మంది సపోర్ట్
ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా ప్రతి హోటల్‌లోని గదుల నిర్వహణ తీరును, ప్రయాణికుల రికార్డులను పోలీసులు నిశితంగా పరిశీలించారు. అక్కడికి వచ్చే అతిథుల నుంచి తప్పనిసరిగా ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను సేకరిస్తున్నారా లేదా అనే విషయాన్ని నిరూపించుకోవాలని యాజమాన్యాలకు స్పష్టం చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా గదులను కేటాయించడం, అనుమానాస్పద వ్యక్తులకు ఆశ్రయం కల్పించడం వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు.
దీనితో పాటు నిఘా వ్యవస్థ బలోపేతం కోసం సిసిటివి కెమెరాల పనితీరును, రికార్డింగ్ డేటా నిల్వ సామర్థ్యాన్ని అధికారులు స్వయంగా తనిఖీ చేశారు. భద్రతా ప్రమాణాలను విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని, భవిష్యత్తులోనూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. నేరాల నియంత్రణ, పరారీలో ఉన్న నిందితుల గుర్తింపు కోసం నగర భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, వ్యాపార సంస్థలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
