Telangana Rains: తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు(Telangana Rains) రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
- V Santhosh Kumar
- Updated on- June 8, 2026 / 08:55 AM IST
telangana rains update and weather update monsoon entry date announced
- తెలంగాణకు నైరుతి రుతుపవనాల రాక.
- వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు.
- రాష్ట్రవ్యాప్తంగా చల్లబడిన వాతావరణ పరిస్థితులు.
Telangana Rains: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఒక చల్లని కబురు చెప్పింది. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు జూన్ 10వ తేదీన లేదా అంతకంటే ముందే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఇవి వేగంగా ముందుకు కదులుతున్నాయని, రాబోయే మూడు రోజుల్లో తెలంగాణను తాకుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే కేరళను తాకిన ఈ రుతుపవనాలు, ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది కాస్త ఆలస్యంగా వస్తున్నాయని, వర్షపాతం కూడా కొద్దిగా తక్కువగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Yadagirigutta Temple: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్త జనం.. స్వామిని దర్శించుకున్న 92 వేల మంది భక్తులు
అయితే, రుతుపవనాలు అధికారికంగా రాకముందే రాష్ట్రంలో(Telangana Rains) వాతావరణం గణనీయంగా చల్లబడనుంది. ద్రోణి ప్రభావం కారణంగా రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మంగళవారం నాడు కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్ సహా దాదాపు 20కి పైగా జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే వీలుంది.
ఇక గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరులో 4 సెంటీమీటర్ల వర్షం కురవగా, హైదరాబాద్‌లోని గోల్కొండలో 3 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. వీటితో పాటు పరిగి, నవాబ్‌పేట్, ఆలంపూర్ వంటి ప్రాంతాలలో కూడా 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఈ ప్రీ-మాన్‌సూన్ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు కాస్త అదుపులోకి వచ్చాయి.
