తెలంగాణలో మరో కలకలం : జమాతే సదస్సుకు హైదరాబాద్ రోహింగ్యాలు

  • Publish Date - April 27, 2020 / 05:51 AM IST

తబ్లిగే జమాతే వ్యవహారంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌ రోహింగ్యా క్యాంప్‌ నుంచి పలువురు రోహింగ్యాలు జమాత్‌కు హాజరైనట్టు  కేంద్రం హోంశాఖ గుర్తించింది. ఢిల్లీలోని రోహింగ్యాలు సైతం జమాత్‌ కార్యకలాపాల్లో పాల్గొన్నారని నిఘా వర్గాలు తేల్చాయి. జమాత్‌కు వెళ్లిన పలువురు రోహింగ్యాలు తిరిగి క్యాంపునకు చేరుకోలేదని నిఘావర్గాలు  గుర్తించాయి. దేశవ్యాప్తంగా రోహింగ్యా క్యాంపుల నుంచి జమాత్‌కు హాజరయ్యారని.. రోహింగ్యాల కదలికలను గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.  రోహింగ్యాలందరినీ స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది. 

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గురువారం 50 మందికి పాజిటివ్‌ రాగా, శుక్రవారం ఏకంగా 66 మంది కరోనా బారిన పడ్డారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 766కు చేరింది. ఇప్పటివరకు 18 మంది మరణించగా.. కరోనా నుంచి కోలుకుని 186 మంది ఇంటికి వెళ్లినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఆ తర్వాత నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 

హైదరాబాద్‌లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్‌లో శుక్రవారం కొత్తగా 30 కేసులు నమోదయ్యాయి. ఈ 30మందితో కాంటాక్ట్ ఉన్న వారికి కూడా టెస్ట్‌ నిర్వహించారు అధికారులు.. అనుమానితులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 286 యాక్టివ్‌ కేసులుండగా..  131 మంది కరోనా నుంచి కోలుకున్నారు.