Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక బస్సు ఎక్కేముందే టికెట్ బుకింగ్..
హైదరాబాద్ నగరవాసుల రోజువారీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC)సరికొత్త సాంకేతిక సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది.
- V Santhosh Kumar
- Published on- August 5, 2026 / 07:14 AM IST
Telangana RTC set to introduce advance and boarding ticketing services soon
- బస్సు ఎక్కకముందే మొబైల్ టికెట్
- విద్యార్థులకు నేరుగా డిజిటల్ బస్‌పాస్
- తప్పనున్న కండక్టర్, ప్రయాణికుల ఇబ్బందులు
Telangana RTC: హైదరాబాద్ నగరవాసుల రోజువారీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC)సరికొత్త సాంకేతిక సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తుండటంతో, రద్దీ సమయాల్లో ఎదురయ్యే రవాణా ఇబ్బందులను నివారించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు. ముఖ్యంగా మెట్రో రైల్ తరహాలోనే బస్సు ఎక్కడానికి ముందే టికెట్ తీసుకునే ‘అడ్వాన్స్/బోర్డింగ్ టికెటింగ్’ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ వినూత్న ప్రతిపాదన డిజిటల్ చెల్లింపులను పెంచడంతో పాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది.
Rain Alert: మారుతున్న వాతావరణం.. మూడు రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
యాప్ ద్వారా ముందస్తు టికెటింగ్ – సులువైన ప్రయాణం:
ప్రస్తుతం ఆర్టీసీ ఉపయోగిస్తున్న ‘మీ టికెట్’ యాప్‌లోనే ఈ అడ్వాన్స్ టికెటింగ్ ఫీచర్‌ను అనుసంధానించనున్నారు. ప్రయాణికులు తమ మొబైల్ యాప్ ద్వారా బోర్డింగ్ పాయింట్, గమ్యస్థానాన్ని ఎంచుకుని యూపీఐ లేదా కార్డుల ద్వారా ముందే టికెట్ కొనుగోలు చేయవచ్చు. అలాగే బస్సుల నిజ సమయ (రియల్ టైమ్) స్థానాన్ని ట్రాక్ చేస్తూ ప్రయాణాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉన్నప్పుడు కండక్టర్ వద్ద టికెట్ తీసుకోవడం, చిల్లర సమస్యలు లేదా సాంకేతిక లోపాల వల్ల కలిగే జాప్యానికి ఈ విధానం శాశ్వత పరిష్కారం చూపుతుంది.
డిజిటల్ బస్‌పాస్‌లు & సాంకేతిక విస్తరణ:
గతంలో ప్రారంభించిన డిజిటల్ సిటీ బస్‌పాస్‌లకు నగరవాసుల నుండి విశేష స్పందన లభించడంతో, ఈ సేవలను విద్యార్థులకు కూడా విస్తరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ‘మీ టికెట్’ యాప్ ద్వారా స్టూడెంట్ బస్‌పాస్‌లను జారీ చేయడం వల్ల కౌంటర్ల వద్ద గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు. ఇది విద్యార్థులకు శ్రమను తప్పించడమే కాకుండా, ఆర్టీసీ సిబ్బందిపై ఉన్న పనిభారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ అధునాతన డిజిటల్ సర్వీసులు ఆర్టీసీ సేవల్లో పారదర్శకతను, వేగాన్ని పెంచి నగర ప్రజా రవాణాను సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాయి.
