SIR Enumeration : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. SIR ఎన్యూమరేషన్‌లో కీలక గణాంకాలివే!
SIR Enumeration : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సర్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
- Sreehari A
- Updated on- August 11, 2026 / 03:48 PM IST
SIR Enumeration
SIR Enumeration : తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. SIR ఎన్యూమరేషన్ వివరాలను తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3,38,26,448 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్యూమరేషన్‌లో భాగంగా సేకరించిన ఫారాల్లో 2,64,87,214 ఫారాలను డిజిటలైజ్ చేశారు.
అయితే, మొత్తం ఫారాల్లో 78.30 శాతంగా నమోదైంది. మరోవైపు 73,39,234 లక్షలు ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించలేకపోయినట్లు వెల్లడించారు. సేకరించలేని ఫారాల్లో వివిధ కారణాలతో ఓటర్ల వివరాలను నిర్ధారించలేదని తెలిపారు. అందులో 21.70 శాతం ఫారాలను అన్‌కలెక్టబుల్‌గా గుర్తించినట్టు తెలిపారు.
ఎవరెక్కడంటే? SIR లెక్కలివే :
సేకరించలేని ఫారాల పరిశీలనలో 9,22,230 మంది ఓటర్లు మరణించినట్లు గుర్తించారు. 11,25,546 లక్షల మంది అందుబాటులో లేకపోవడం లేదా ఆచూకీ దొరకకపోవడంగా నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే, 45,18,961 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు గుర్తించారు. మరో 6,70,203 మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదై ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. 1,02,294 మందిని ఇతర కేటగిరీలో చేర్చారు.
ఓటర్ల లిస్టులో కీలక మార్పులకు ఛాన్స్ :
SIR ఎన్యూమరేషన్‌లో వెల్లడైనా వివరాల ఆధారంగా తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీగా మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన వారు వంటి కేటగిరీలపై తర్వాతి దశలో అధికారులు పరిశీలన చేపట్టనున్నారు.
అయితే, ఎన్యూమరేషన్‌లో గుర్తించిన వివరాల ఆధారంగా వెంటనే ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు కాదు.. తుది ఓటర్ల జాబితా ప్రక్రియలో నిబంధనల ప్రకారమే పరిశీలన, అభ్యంతరాలు, సవరణలకు సంబంధించిన చర్యలు ఉండొచ్చు. తెలంగాణలో సర్ ఎన్యూమరేషన్ ద్వారా ఓటర్ల వివరాలపై సమగ్ర డేటా సిద్ధం అయింది. తుది ఓటర్ల జాబితా ఎలా ఉంటుందనేదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
