Monsoon Arrival : హమ్మయ్యా ఊపిరి పీల్చుకోండి.. రాష్ట్రంలో తగ్గనున్న ఎండలు.. నైరుతి రాక ఎప్పుడంటే..!
Monsoon Arrival : నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
- Dharani Pilli
- Updated on- May 31, 2026 / 10:16 AM IST
Telangana Weather Update Monsoon Arrival Date Announced June 10 and Relief from Heatwave Soon
Monsoon Arrival : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వడగాడ్పుల గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు హీట్ వేవ్ కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పింది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాల ఆగమనంపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతాయని తెలిపింది. జూన్ 10-12 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు.. కేరళతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలను తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది.
*ఏపీలో పిడుగుల వానలు.. రేపు ఈ 5 జిల్లాలకు అలర్ట్..
ప్రస్తుతం కేరళ, ఆ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు, మూడు రోజుల్లో గాలుల దిశ మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. భూమధ్య రేఖ దాటి హిందూ మహాసముద్రంలోకి రుతుపవన మేఘాల రాక మొదలైంది. ఈ వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న వాతావరణ శాఖ, వచ్చే నాలుగైదు రోజుల్లో కేరళ, తమిళనాడుకు రుతుపవనాలు రానున్నాయని వెల్లడించింది.
మరోవైపు హైదరాబాద్‌లో జూన్ 1 నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ నగరంలో సోమవారం నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు 36-38 డిగ్రీలకు తగ్గుతాయని.. అలాగే మిగతా జిల్లాల్లో 40-42 డిగ్రీల మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వడగాడ్పుల తీవ్రత తగ్గుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. జూన్ 5 తర్వాత రాష్ట్రమంతా సగటు పగటిపూట ఉష్ణోగ్రతలు 38-39 డిగ్రీల మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తెలంగాణవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఆసిఫాబాద్ జిల్లా దహగాన్‌లో అత్యధికంగా 46.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది.
