Telugu Must : సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూల్స్‌లోనూ తెలుగు తప్పనిసరి.. ప్రభుత్వం ఆదేశాలు
ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
- Naveen
- Published On : June 14, 2022 / 11:44 PM IST
Telugu Must
Telugu Must : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషకు పట్టం కట్టింది. రాష్ట్రంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూల్స్‌లోనూ తెలుగు భాషను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
బోర్డులు, బోధనా మాధ్యమంతో సంబంధం లేకుండా తెలుగును బోధించాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2018-19 నుంచి దశలవారీగా తెలంగాణ (పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి బోధన, అభ్యాసం) చట్టం 2018 అమల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. భావి తరాలకు ఉపయోగపడేలా తెలుగు భాష, సాహిత్యాన్ని పరిరక్షించేందుకు అన్ని పాఠశాలల్లో మాతృభాషను తప్పనిసరి చేశారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
గత విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు తెలుగు భాష బోధనను తప్పనిసరి చేశారు. ఈ విద్యా సంవత్సరం అంటే 2022-23లో అన్ని పాఠశాలల్లో 1-10వ తరగతి వరకు తెలుగును ఒక భాషగా అమలు చేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు మాతృభాష కాని పిల్లల కోసం 1-5వ తరగతి వరకు ‘తేనెపలుకులు’, 6 -10వ తరగతి వరకు ‘వెన్నెల’ పేరుతో పాఠ్య పుస్తకాలను రూపొందించారు. తెలుగు మాతృభాషగల విద్యార్థుల కోసం ప్రామాణిక పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచారు. 1-5వ తరగతి వరకు ‘జాబిలి’.. 6,7,8 తరగతుల కోసం ‘నవ వసంతం’.. 9,10వ తరగతులకు ‘సింగిడి’ పేరుతో పుస్తకాలను రూపొందించారు. ఈ పుస్తకాలు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి ఎస్సీఈఆర్టీ వెబ్‌సైట్ http://scert.telangana.gov.in లో అందుబాటులో ఉంచారు.
తెలుగు భాష బోధన విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామంది. తప్పు చేసిన యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీచేస్తామని, జరిమానా విధించడం లేదా గుర్తింపు రద్దు చేయడం లాంటి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
