TGPSC Notifications: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. TGPSC నుంచి మరో 15 నోటిఫికేషన్లు.. భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగార్థులకు ప్రభుత్వం(TGPSC Notifications) నుంచి త్వరలోనే భారీ శుభవార్త అందనుంది.
Tgpsc to release 15 new job notifications over 3800 posts
- టీజీపీఎస్సీ నుంచి 15 ప్రకటనలు
- ఫారెస్ట్, ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ
- సిబిటి విధానంలో తక్షణ మార్కులు
TGPSC Notifications: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగార్థులకు ప్రభుత్వం నుంచి త్వరలోనే భారీ శుభవార్త అందనుంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ టీజీపీఎస్సీ (TGPSC Notifications) మరో 15 ఉద్యోగ ప్రకటనలను వరుసగా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెలాఖరు నుంచి లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఈ నోటిఫికేషన్లు విడుదలే దిశగా కమిషన్ తుది కసరత్తును ముమ్మరం చేసింది. నెలకు రెండు లేదా మూడు చొప్పున వరుస నోటిఫికేషన్లు జారీ చేసేందుకు పాలనాపరమైన ప్రక్రియను సైతం పూర్తి చేసింది.
ఇంజినీరింగ్, ఫారెస్ట్ కేటగిరీల్లో భారీగా పోస్టులు:
ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన 3,800 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు ఇప్పటికే అందాయి. అందులో భాగంగా అత్యధికంగా 1,398 అటవీ బీట్ అధికారి (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్) పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులు, టెక్నికల్ సహాయకులు వంటి ప్రొఫెషనల్ విభాగాల్లో భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతలు, పోస్టుల వివరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కమిషన్ వీటికి త్వరలోనే ఆమోదం తెలపనుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు – తక్షణ ఫలితాలు:
ఈసారి ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, వేగం పెంచేందుకు టీజీపీఎస్సీ కీలక సాంకేతిక మార్పులు చేస్తోంది. సాధ్యమైనంత వరకు అన్ని పోటీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలోనే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నూతన విధానం ద్వారా అభ్యర్థులు పరీక్ష పూర్తయిన వెంటనే తమ మార్కులను స్క్రీన్‌పై తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. దీనివల్ల ఫలితాల వెల్లడిలో ఆలస్యం తగ్గి, ఎంపిక ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తవుతుందని కమిషన్ భావిస్తోంది.
