Bhu Bharathi Portal: తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. ‘భూభారతి పోర్టల్’లో కీలక మార్పులు.. ఒకే అప్లికేషన్‌తో అన్ని పరిష్కారాలు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని భూ యజమానులు, రైతులకు ఊరటనిచ్చేలా భూభారతి పోర్టల్(Bhu Bharathi Portal)లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.
Telangana government introduces single application system for land issues in bhu bharathi portal
- భూభారతి పోర్టల్‌లో నూతన నిబంధనలు
- భూసమస్యలన్నింటికీ ఒక్కటే దరఖాస్తు
- రైతుల సమయం ధనం ఆదా
Bhu Bharathi Portal: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని భూ యజమానులు, రైతులకు ఊరటనిచ్చేలా భూభారతి (భూమిపై హక్కుల రికార్డు చట్టం, 2024) (Bhu Bharathi Portal)పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. గతంలో భూమికి సంబంధించిన చిన్న చిన్న పొరపాట్లు లేదా వేర్వేరు సమస్యలు ఉంటే, ప్రతి దానికి విడివిడిగా దరఖాస్తులు చేసుకుంటూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్య పరిష్కారార్థం రెవెన్యూ శాఖ సరికొత్త వెసులుబాటును అందుబాటులోకి తెచ్చి, సింగిల్ అప్లికేషన్ విధానానికి శ్రీకారం చుట్టింది.
ఒకే అప్లికేషన్‌తో బహుళ సమస్యల పరిష్కారం:
నూతన నిబంధనల ప్రకారం భూమి విస్తీర్ణం తప్పుగా నమోదు కావడం, సర్వే నంబర్, సబ్ డివిజన్ పొరపాట్లు, పట్టాదారు పేరు సరిదిద్దడం, వారసత్వ మార్పులు (సక్సెషన్), సరిహద్దు వివాదాలు, పాస్‌పుస్తకంలో వివరాల నమోదు, అలాగే నిషేధిత జాబితా (22A) వంటి అనేక రకాల భూ సమస్యలు ఉన్నప్పటికీ, వాటన్నింటికీ ఒకే దరఖాస్తు ద్వారా పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ నిర్ణయంతో రైతుల సమయం, ధనం ఆదా అవుతాయని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు.
ప్రతి దరఖాస్తు ఆన్లైన్లో నమోదు తప్పనిసరి:
రెవెన్యూ సేవల పారదర్శకత కోసం ఇకపై ప్రతీ భూ సమస్యను తప్పనిసరిగా ఆన్లైన్ లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. రైతులు సమర్పించిన ఒకే దరఖాస్తు ఆధారంగా అధికారులు సమగ్ర విచారణ జరిపి అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరిస్తారు. ఈ నూతన సంస్కరణ వల్ల భూ రికార్డుల ప్రక్షాళన వేగవంతం కావడమే కాకుండా, గ్రామ స్థాయిలో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
