Tur Dal Price Rise : కందిపప్పు కొంటున్నారా? కిలో రేటు ఎంతో తెలుసా.. సామాన్యుడి బడ్జెట్‌కు భారీ షాక్!
Tur Dal Price Rise : తెలుగు రాష్ట్రాల్లో కందిపప్పు ధరలు వినియోగదారులను కాస్త ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం వంటింట్లో ఉపయోగించే కందిపప్పు ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో.. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది.
- Harish Thanniru
- Published on- October 11, 2026 / 08:25 AM IST
Tur Dal Price Rise
Tur Dal Price Rise : తెలుగు రాష్ట్రాల్లో కందిపప్పు ధరలు వినియోగదారులను కాస్త ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం వంటింట్లో ఉపయోగించే కందిపప్పు ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో.. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. హోల్‌సేల్ మార్కెట్లో గతంలో కిలో రూ.110గా ఉన్న కందిపప్పు ధర ప్రస్తుతం రూ.160కు చేరినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే నవంబరు చివరి నాటికి కిలో ధర రూ.200 దాటే అవకాశం ఉందని కొందరు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు నాణ్యత, బ్రాండ్‌ను బట్టి మారుతున్నాయి. సాధారణ రకం లూజ్ కందిపప్పు కిలో రూ.90 నుంచి రూ.130 వరకు విక్రయిస్తుండగా, సూపర్ మార్కెట్లలో లభించే నాణ్యమైన బ్రాండెడ్ రకాల ధరలు రూ.140 నుంచి రూ.165కు పైగా ఉంటున్నాయి. సేంద్రియ కందిపప్పు ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రిటైల్ మార్కెట్లలో అర కిలో ఆర్గానిక్ కందిపప్పు ప్యాకెట్ రూ.198 వరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలో కంది సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే పెరిగినట్లు చెబుతున్నారు. 2025–26 వ్యవసాయ సీజన్‌లో సుమారు 1,92,792 హెక్టార్లలో కంది సాగవ్వగా.. 2026–27 సీజన్‌లో ఈ విస్తీర్ణం 2,25,163 హెక్టార్లకు పెరిగింది. అంటే సుమారు 32 వేల హెక్టార్లకుపైగా సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.6 లక్షల టన్నుల కంది దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, పంట సాగు పెరిగిందని దిగుబడి కూడా పెరుగుతుందని చెప్పలేం. వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పులు పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లలో వండే పప్పు, సాంబార్ నుంచి హోటళ్లు, ఫంక్షన్ల వరకు కందిపప్పుకు విస్తృతమైన డిమాండ్ ఉంది. అందువల్ల సరఫరాలో స్వల్ప మార్పు వచ్చినా మార్కెట్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దేశీయ ఉత్పత్తి వినియోగానికి సరిపోకపోతే దిగుమతుల ద్వారా లోటును భర్తీ చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్కెట్ సరఫరాను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
మరోవైపు, రాష్ట్రంలో కంది సాగును మరింత ప్రోత్సహించడం, రైతులకు మెరుగైన విత్తనాలు అందించడం, అనువైన యాసంగి పప్పుధాన్యాల సాగుపై దృష్టి పెట్టడం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పంట మార్కెట్‌కు వచ్చే సమయానికి దిగుబడులు ఆశించిన స్థాయిలో ఉంటే ధరల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. లేకపోతే కందిపప్పు కొనుగోలు సామాన్య కుటుంబాలకు మరింత భారంగా మారవచ్చు.
