Ujjaini Mahankali Bonalu: ఘనంగా ‘ఉజ్జయిని బోనాల’ ఏర్పాట్లు.. భారీగా ట్రాఫిక్ ఆంక్షలు,14 పార్కింగ్ కేంద్రాలు.. పోలీసుల కీలక సూచన
సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి బోనాల(Ujjaini Mahankali Bonalu) జాతరను పురస్కరించుకుని హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
- V Santhosh Kumar
- Published on- July 31, 2026 / 05:27 PM IST
ujjaini mahankali bonalu traffic diversions august 2nd to 4th
- మహంకాళి జాతర ట్రాఫిక్ ఆంక్షలు
- ఆగస్టు రెండునుండి రూట్ల మళ్లింపు
- పద్నాలుగు ప్రాంతాల్లో వాహన పార్కింగ్
Ujjaini Mahankali Bonalu: సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, భక్తుల సౌకర్యార్థం, నగరంలో రద్దీని నివారించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు:
* ఆగస్టు 2 నుంచి 4 వరకు మహంకాళి ఆలయం (Ujjaini Mahankali Bonalu)పరిసరాల్లో 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
* పొగాకు బజార్, సుభాష్ రోడ్, హిల్ స్ట్రీట్ రహదారులను పూర్తిగా మూసివేయనున్నారు.
* జనరల్ బజార్ – మహంకాళి ఆలయ మార్గంలో వాహనాల రాకపోకలను నిషేధించారు.
* ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, ఘాస్‌మండి, బైబిల్ హౌస్, కర్బాలా ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు విధించారు.
* క్లాక్ టవర్ – ఆర్‌పీ రోడ్ వాహనాలను ఎస్‌బీఐ, రాణిగంజ్ వైపు, ప్యాట్నీ – ట్యాంక్‌బండ్ వాహనాలను ప్యారడైజ్, క్లాక్ టవర్ మీదుగా మళ్లిస్తారు.
* ప్యారడైజ్ నుంచి ఎంజీ రోడ్ వెళ్లే వాహనాలు సింధీ కాలనీ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
* సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గాల్లోనూ ప్రత్యేక మళ్లింపులు ఉంటాయి.
పార్కింగ్ సదుపాయాలు, ఆర్టీసీ బస్సులు:
ఆర్టీసీ బస్సులను ట్యాంక్‌బండ్, బేగంపేట్ వైపు మీదుగా వెళ్లేందుకు ప్రత్యేక రూట్లను కేటాయించారు. భక్తుల వాహనాల కోసం హరిహర కళాభవన్, మహబూబ్ కాలేజీ, సీఎంఆర్ మాల్, వెస్లీ కాలేజ్, జింఖానా గ్రౌండ్, స్వప్నలోక్ కాంప్లెక్స్ వంటి 14 ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ఎప్పటికప్పుడు తాజా ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను ఫాలో కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
