Mancherial District : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం.. ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. చివరిలో బిగ్ షాక్..
Mancherial District : ఇన్సూరెన్స్ డబ్బులకోసం భర్తను ప్రియుడితో కలిసి హత్యచేయించింది ఓ భార్య. ఈ ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట ఆర్అండ్ఆర్ కాలనీలో చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Published on- May 27, 2026 / 09:37 AM IST
Mancherial District : ఇన్సూరెన్స్ డబ్బులకోసం భర్తను ప్రియుడితో కలిసి హత్యచేయించింది ఓ భార్య. ఈ ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట ఆర్అండ్ఆర్ కాలనీలో చోటు చేసుకుంది. అయితే, మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. ఆ తరువాత రంగంలోకిదిగి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన సాయిని కుమార్(45), భారతి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే కాలనీకి చెందిన వ్యాపారి లగిశెట్టి సురేందర్, భారతి మధ్య కొన్నేండ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో సాయిని కుమార్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగివచ్చి భార్యను కొట్టి హింసించేవాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించాలని భారతి ప్లాన్ వేసింది.
ఇదిలాఉంటే.. గుడిపేటకు చెందిన రామ్ మల్లేశ్ వద్ద సాయిని కుమార్ 60వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పుతీర్చమని సాయిని కుమార్‌ను మల్లేశ్ పలుసార్లు అడిగాడు. కానీ, అతను అప్పు తిరిగి చెల్లించేందుకు నిరాకరించాడు. దీంతో మల్లేశ్ చాలాసార్లు కుమార్ ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో పాటు చంపుతానని బెదిరించాడు. అప్పటికే భర్తపై కోపంతో ఉన్న భారతి తన ప్రియుడు సురేందర్‌తో కలిసి సాయిని కుమార్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. మల్లేశ్ ఇంటికొచ్చి సాయిని కుమార్‌ను హత్యచేస్తానంటూ బెదిరించిన తరువాత.. మల్లేశ్‌తో కుమార్‌ను చంపించాలని భారతి, సురేందర్ ప్లాన్ చేశారు.
గత ఏడాది జనవరి నుంచి కుమార్‌కు తెలియకుండా అతడి పేరిట వివిధ కంపెనీల్లో రూ.3కోట్లకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించారు. కుమార్‌ను చంపేందుకు మల్లేశ్‌తో రూ.12 లక్షలకు ఒప్పందం చేసుకొని రూ.2లక్షలు చెల్లించింది. మిగిలిన రూ. 10 లక్షలు కుమార్‌ను చంపిన తరువాత ఇన్సూరెన్స్ క్లెయిమ్
చేసుకొని చెల్లిస్తామని ఒప్పుకున్నారు. మల్లేశ్ మంచిర్యాలకు చెందిన తాపీ మేస్త్రీ శ్రీరామ్ కుమార్‌తో కలిసి ఈ నెల 22న రాత్రి సాయిని కుమార్‌ను మద్యం తాగుదామని పిలిచాడు.
ముల్కల్ల పంపు హౌస్ రోడ్‌లో ముగ్గురు కలిసి మద్యం తాగిన తరువాత కుమార్ పై సుత్తితో దాడి చేసి, చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. రాత్రి ఒంటి గంట టైమ్‌లో అటుగా వెళ్లిన ప్రయాణికులు చూసి హాజీపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు సాయిని కుమార్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో సాయిని కుమార్‌ది హత్యగా నిర్దారించారు. అసలు విషయం వెలుగులోకి రావడంతో మృతుడి భార్యతోపాటు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో శ్రీరామ్ కుమార్ పరారీలో ఉన్నాడు.
