Jagtial : పెళ్లి చేస్తామని ప్రేమగా ఇంటికి పిలిచి.. యువతిపై దాడి
తన కుమారుడు ప్రేమించిన యువతిపై ఓ మహిళ దాడి చేసింది. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
- kunduru Vinod
- Published On : August 15, 2021 / 01:16 PM IST
Jagtial
Jagtial : జగిత్యాల జిల్లాలో యువతిపై ఆమె ప్రియుడి తల్లి దాడి చేసింది. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే జగిత్యాలకు చెందిన భరత్, శివాని గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. కొద్దీ రోజుల క్రితం భరత్ కు వేరే యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లి ఇష్టం లేని భరత్ రెండు రోజుల క్రితం శివానిని తీసుకోని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.
దీంతో భరత్ తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇద్దరికి పెళ్లి చేస్తామని ఇంటికి పిలిపించారు. తల్లిదండ్రుల మాటలు నమ్మిన భరత్, శివానిని తీసుకోని ఇంటికి వచ్చాడు. శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో భరత్ తల్లి అరుణ శివానిపై రాడ్డుతో దాడి చేసింది. ఈ సమయంలోనే శివాని గట్టిగా కేకలు వేయడంతో ఆమెను రక్షించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
రాడ్డుతో కొట్టడంతో శివాని తలకు బలమైన గాయమైంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
