Vijay Oath Taking Row : విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం.. తమిళ సంస్కృతికి విరుద్ధమంటూ విమర్శలు
Vijay Oath Taking Row : తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణస్వీకారంలో తీవ్ర వివాదం చోటు చేసుకుంది.
- Dharani Pilli
- Updated on- May 11, 2026 / 11:23 AM IST
controversy on cm vijay swearing in ceremony against thamizh thai vazhthu song
Vijay Oath Taking Row : తీవ్ర ఉత్కంఠ పరిణామాల తర్వాత ఎట్టకేలకు టీవీకే అధినేత విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉదయం 10.17 గంటలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా విజయ్ ప్రమాణం చేసిన అనంతరం.. 8 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంపై వివాదం రాజుకుంది. విజయ్ తమిళ సంస్కృతిని ఉల్లంఘించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకూ ఏం జరిగిందంటే..
ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభానికి ముందే వందేమాతరం, జనగణమన ఆలపించారు. ఆ తర్వాతే ‘తమిళ్ తాయ్ వాల్త్తు’ను ఆలపించారు. తమిళ్ తాయ్ వాల్త్తు అనేది తమిళనాడు ప్రభుత్వ అధికారిక రాష్ట్ర గీతం. మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్.. 2021 మేలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో భాగంగా, ముందుగా తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ఆలపించారని.. ఆ తర్వాతే జనగణమన ఆలపించారని చెబుతున్నారు.
* తమిళనాడు విజయ్ అత్యంత సన్నిహితుల శిబిరంలో.. తెలుగు మాజీ సీఎం బావమరిది..
కానీ ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో వందేమాతరం, జనగణమన తర్వాత తమిళ్ తాయ్ వాల్త్తును ఆలపించారు. ఇలా చేయడం ద్వారా తమిళనాడు సంప్రదాయానికి భంగం కలిగిందని, తమిళ సంస్కృతిని అవమానించారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై సీపీఐ కార్యదర్శి ఎం. వీరపాండియన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ జారీ చేసిన ఆదేశాల మేరకు, తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమ షెడ్యూల్‌లో వందేమాతరం గీతానికి ప్రాధాన్యతనిస్తూ, తమిళ గీతాన్ని మూడో స్థానంలో ఉంచడం అనేది తమిళనాడులో కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటూ ఒక లేఖ విడుదల చేశారు. ‘తమిళ్ తాయ్ వాల్త్తు’కు తగిన ప్రాధాన్యం లభించేలా టీవీకే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
