Traffic Challan : ఇదేం పద్దతి సామీ..! కారుకు చలానా వేశారు సరే.. మరి అట్లాంటిక్ సముద్రంలోకి ఎలా వెళ్లింది?
Yamuna Expressway Traffic Challan : యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై కేవలం గంటకు 1 కిలోమీటర్ వేగం ఎక్కువగా వెళ్లినందుకు ఓ వాహనదారుడికి రూ.2 వేల జరిమానా పడింది. అయితే చలానాలో కారు లొకేషన్ అట్లాంటిక్ మహాసముద్రంలో చూపించడంతో అతడితో పాటు నెటిజన్లు సైతం షాక్‌కు గురయ్యారు.
- Harish Thanniru
- Published on- November 15, 2026 / 08:38 AM IST
Yamuna Expressway Traffic Challan
Yamuna Expressway Traffic Challan : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు. అయితే కేవలం గంటకు ఒక కిలోమీటర్ వేగం ఎక్కువగా వెళ్లినందుకు రూ.2 వేల జరిమానా విధిస్తే ఎలా ఉంటుంది? పోనీ జరిమానా వేసిన ప్రాంతం సరైనదేనా అంటే.. ఆ కారు ఏకంగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నట్లు చూపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై అనుజీత్ శివమ్ అనే వ్యక్తి తన కారులో ప్రయాణిస్తుండగా ఓవర్‌స్పీడింగ్ చేసినట్లు గుర్తించిన ట్రాఫిక్ కెమెరాలు ఆయనకు రూ.2,000 జరిమానా విధించాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల గరిష్ఠ వేగ పరిమితి గంటకు 100 కిలోమీటర్లు కాగా.. ఆయన కారు గంటకు 101 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు చలానాలో నమోదైంది. అంటే కేవలం ఒక కిలోమీటర్ వేగం ఎక్కువగా వెళ్లినందుకు జరిమానా పడింది.
ఈ జరిమానా వివరాలను పరిశీలించిన వాహనదారుడికి మరో ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. ట్రాఫిక్ కెమెరా నమోదు చేసిన వాహనం లొకేషన్ 0°N, 0°Eగా ఉంది. ఈ అక్షాంశ, రేఖాంశాలను మ్యాప్‌లో పరిశీలిస్తే అవి అట్లాంటిక్ మహాసముద్రంలోని ఓ ప్రాంతాన్ని సూచిస్తున్నాయి. దీంతో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణించిన తన కారు సముద్రంలో ఉన్నట్లు చలానాలో ఎలా చూపించారని ఆయన ప్రశ్నించారు.
అనుజీత్ శివమ్ నవంబర్ 12న తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో చలానా వివరాలతో సహా పోస్టు చేశారు. గంటకు 101 కిలోమీటర్ల వేగంతో వెళ్లినందుకు రూ.2 వేల జరిమానా విధించారని, అంతేకాకుండా వాహనం లొకేషన్‌ను అట్లాంటిక్ మహాసముద్రంలో చూపించారని పేర్కొన్నారు. ఈ చలానా విధానం, ట్రాఫిక్ కెమెరాల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై స్పందించిన నోయిడా ట్రాఫిక్ పోలీసులు.. సమస్య పరిష్కారం కోసం ఈ-చలాన్ హెల్ప్‌లైన్ నంబర్ 7065060882కు ఫోన్ చేయాలని సూచించారు.
అయితే ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక కిలోమీటర్ వేగం ఎక్కువగా వెళ్లినందుకే జరిమానా విధించడం సరైనదేనా? కెమెరాలు నమోదు చేసిన వివరాల్లో తప్పులు ఉంటే బాధ్యత ఎవరిది? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో ఆటోమేటిక్ ట్రాఫిక్ నిఘా కెమెరాలు, జీపీఎస్ వివరాల ఖచ్చితత్వంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా వాహనం వేగం, ప్రయాణించిన ప్రాంతం వంటి వివరాలు సరిగ్గా నమోదవుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
