నేరవేరిన నెల్లూరు జిల్లా వాసుల కోరిక: ఆ రూట్ లో మరో రైలు

  • Publish Date - August 31, 2019 / 07:27 AM IST

నెల్లూరు జిల్లా వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ.. గూడూరు స్టేషన్ ల మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ కోరిక నెరవేరింది. విజయవాడ-గూడూరు స్టేషన్ ల మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు సర్వం సిద్ధం చేసింది రైల్వే శాఖ. 2019 సెప్టెంబరు 1వ తేదీ నుంచి సర్వీసును ప్రారంభించాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతులమీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు(01 సెప్టెంబర్ 2019) జరగనుంది.

కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్‌ అంగడి ఈ కార్యక్రమానికి హాజరు కానుండగా.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్‌ నుంచి నడిచే ఈ రైలును తన సొంతజిల్లా నెల్లూరు జాల్లా గూడూరు నుంచి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. విజయవాడ-గూడూరు మధ్య రోజూ ఈ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుంది. ఈ రైలుకు విజయవాడ డివిజన్‌ అధికారులు 12743/12744 నెంబరును కేటాయించారు.

నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి రైల్వే స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగనుంది. ఈ రైలు పూర్తి చైర్‌కార్‌గా ఉంటుంది. మొత్తం 14 బోగీల్లో రెండు గార్డు బోగీలు పోనూ 12 బోగీలు ఉంటాయి. వీటిలో రెండు ఏసీ చైర్‌కార్‌ ఉంటాయి. మిగిలిన 8బోగీలు నాన్‌ ఏసీ బోగీలు .

సెప్టెంబరు 2వ తేదీ నుంచి రెగ్యులర్‌ గా సర్వీసు అందుబాటులోకి రానుండగా..  ప్రతీ రోజూ ఉదయం 6 గంటలకు ఈ రైలు గూడూరులో బయల్దేరుతుంది.  ఉదయం 10గంటల 30నిమిషాల వరకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6గంటల 10నిమిషాలకు మొదలవుతుంది.  రాత్రి 10గంటల 40నిమిషాలకు గూడూరు చేరుకుంటుంది. ప్రారంభోత్సవం సందర్భంగా సెప్టెంబరు 1వ తేదీన మాత్రం ఉదయం 9గంటల 30నిమిషాలకు గూడూరులో రైలు బయల్ధేరనుంది. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది.