ముగిసిన ఏపీ కేబినేట్.. నవ్వుకుంటూ కనిపించిన సీఎస్, చంద్రబాబు

  • Publish Date - May 14, 2019 / 12:29 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. కరువు పరిస్థితులు, ఫొని తుఫాన్ వల్ల తలెత్తిన నష్టం, త్రాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ పనులపై కేబినేట్ చర్చించింది. 2గంటల పాటు మంత్రి వర్గ సమావేశం జరగగా ఉపాధి హామీ పథకం అమల్లో ఏపీ ఉత్తమ రాష్ట్రంగా నిలవడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఫ్రూట్‌ఫుల్ డిస్కషన్ జరిగిందని, ఫోని తుఫాన్ నష్టం 3కోట్ల 39లక్షలుగా అంచనా వేసినట్లు వెల్లడించారు. అలాగే అధికారులతో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, అధికారుల సాకారం వల్లే ఐదేళ్లు అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం చంద్రబాబు మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోండగా.. కేబినెట్ భేటీలో వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. ఫొని తుఫాన్ సమయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పనితీరుపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఫొని తుఫాన్ సమయంలో సీఎస్ అద్భుతంగా పనిచేశారంటూ సీఎస్‌ను చంద్రబాబు అభినందించారు.

రెండు గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో ఉపాధిహామీ పథకం అమలులో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలదడంపై సంబంధిత అధికారులను అభినందించారు. 5విభాగాల్లో మొదటి స్థానంలో, 6విభాగాల్లో 2వ స్థానంలో ఏపీ నిలిచిందని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీంతో సంబంధిత శాఖ అధికారులను చంద్రబాబు అభినందించారు. ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు కేబినేట్ భేటీ జరగగా ఈ భేటికి రాష్ట్ర మంత్రులు, శాఖాధిపతులు, సెక్రెటరీలు హాజరయ్యారు.