దమ్ముంటే నాపై దాడి చేయండి.. కార్యకర్తలపై కాదు : వైసీపీకి చంద్రబాబు వార్నింగ్

  • Publish Date - September 3, 2019 / 11:52 AM IST

పోలీసులను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలను జగన్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుందిని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు ఎప్పుడైనా రోడ్డుపై గోడ కట్టిన ఘటనలు చూశామా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో అరాచకాలే రాజ్యమేలుతున్నాయని చంద్రబాబు అన్నారు.

ఇసుక కొరతతో 20లక్షల మందికి పనులు లేవు. తెదేపాకు ఓటు వేశారని ఊళ్లు ఖాళీ చేయమంటారా? పోలీసులు తమ వృత్తికి న్యాయం చేయాలి. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి’’ అని వ్యాఖ్యానించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, టీడీపీ హయాంలో మేం ఇలా చేస్తే మీరుండేవారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్నాడు బాధితుల కోసం ఏర్పాటుచేసిన పునరావాస శిభిరంలో మాట్లాడిన చంద్రబాబు.. కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని వైసీపీకి హితవు పలికారు. ఎలాంటి గొడవలు లేకుండా చూసే బాధ్యతలను పోలీసులు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు ఏడుగురిని హత్య చేశారని, 22 మందిపై భౌతిక దాడులకు దిగారని చంద్రబాబు అన్నారు.

బాధితులు తిరిగి గ్రామాలకు వచ్చే పరిస్థితిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మీకు దమ్ముంటే నాపై దాడి చేయండి. అంతేకానీ నేతలపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం కరెక్ట్ కాదని, సీఎం జగన్ వైఎస్ కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.