ఆ లెటర్ ఫేక్.. జగన్‌ నిర్ణయానికి సపోర్ట్‌పై చిరంజీవి క్లారిటీ

  • Publish Date - December 23, 2019 / 01:57 AM IST

రాజకీయాలకు దూరంగా ప్రస్తుతం సినిమాలకు మాత్రమే దగ్గరగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, జగన్ మూడు రాజధానుల ప్రకటనకు మద్దతు ప్రకటించినట్లుగా ఓ లేఖను విడుదల చేశారు. అయితే అది ఫేక్ లెటర్ అంటూ చిరంజీవి అభిమానులు, జనసేన అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.

వారికి చేతనయినంతగా చిరంజీవి విడుదల చేసిన లెటర్‌ను ఫేక్ అని, అది వైసీపీ సృష్టి అని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో కొంత సక్సెస్ అయ్యారు కూడా. ఈ మేరకు ఆదివారం మరొక ఫేక్ లెటర్‌ను విడుదల చేశారు చిరంజీవి పేరిట.

ఆదివారం(22 డిసెంబర్ 2019) ఉదయం విడుదల చేసిన లెటర్ ప్రకారం నేను ఎటువంటి ప్రకటన చేయలేదు అనేది దాని సారాంశం. ‘‘యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది.. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏవిధమైన ప్రకటన చేయలేదు. తెలుగు ప్రజలకు చేరువచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నాదృష్టి ఉంది. దయచేసి గమనించగలరు.. ’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసినట్లుగా ఆ ప్రకటనలో ఉంది.

అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రాజధానులను సమర్థించినట్లుగా శనివారం విడుదల చేసిన ప్రకటన మాత్రమే వాస్తవమని, ఆదివారం (22 డిసెంబర్ 2019) వచ్చిన ప్రకటన అవాస్తవమని మీడియాకి తెలియజేశారు.

జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లుగా మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక వాయిస్‌ మెసేజ్‌ను విడుదల చేశారు. తెల్లకాగితంపై తన పేరిట వచ్చిన ప్రకటన అవాస్తవమని, ఫేక్‌ అని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

Also Read : పవన్ కు మరో షాక్ : మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు