అది జగనే చెప్పాలి.. ఎవరేం మాట్లాడినా పార్టీకి సంబంధం లేదు

  • Publish Date - February 16, 2020 / 06:28 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రంలో కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు, బీజేపీతో వైసీపీ జట్టు కట్టబోతోందంటూ వార్తలు రాగా.. కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరబోతుందని వస్తున్న వార్తలపై లేటెస్ట్ గా వైసీపీ నేత కోడాలి నాని మాట్లాడారు. అటువంటిది ఏదైనా ఉంటే జగన్ ప్రకటిస్తారని, ఈలోగా ఎవరైనా మాట్లాడితే అది పార్టీ వైఖరి కాదని కొడాలి నాని స్పష్టం చేశారు.

ఎన్డీయేలో చేరికపై పార్టీ అధ్యక్షుడిదే తుది నిర్ణయం అని అన్నారు మంత్రి కొడాలి నాని. ఇక హోదాపై రాజీ పడేదేలేదని, కేంద్రానికి తమ అవసరం చాలా ఉందన్నారు నాని. విపక్షాలు హోదాపై మొసలికన్నీరు కారుస్తున్నాయని విమర్శలు చేశారు. హోదాతోపాటు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష భేటీ నిర్వహించాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్ ను కొట్టిపారేశారు మంత్రి కొడాలి నాని.

రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే.. విపక్షాలే కేంద్రంతో నేరుగా మాట్లాడొచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మాత్రమే ఏపీ అభివృద్ధికి సహకరిస్తుందని వైసీపీ మొదటి నుంచి చెబుతోందని, అదే మాటపై వైసీపీ కట్టుబడి ఉందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పరిస్థితులను బట్టి వైసీపీ అవసరం భవిష్యత్‌లో చాలా ఉందని, రాజ్యసభలో వైసీపీ బలం పెరగనుందని ప్రత్యేకహోదా డిమాండ్ కచ్చితంగా చేస్తామని అన్నారు.