.సెప్టెంబర్ నెల చివరికల్లా కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో ఉండదని..ఆగస్టు చివరివరకు జీహెచ్‌ఎంసీలోను..సెప్టెంబర్ చివరివరకు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతాయని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ వార్త రాష్ట్ర ప్రజలకు ఓ శుభవార్త అని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ధైర్యమే కరోనాకు మందు అని..ఆగస్టు నెలాఖరుకల్లా హైదరాబాద్‌లో కేసులు చాలా వరకు తగ్గుతాయని భరోసా ఇచ్చారు. కరోనా నియంత్రణకి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయనీ..దీంతో కేసులు తగ్గుముఖం పట్టాయని..ఇది చాలా శుభపరిణామం అని శనివారం (ఆగస్టు 8,2020) మీడియాకు తెలిపారు.
తెలంగాణలో ప్రస్తుతం 5శాతం పాజిటివ్ లుగా నమోదవుదనీ..ప్రతీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 వందల కరోనా సెంటర్స్ లో 23వేల వరకూ కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కరోనా నివారణ చర్యలకు ప్రభుత్వం తాజాగా రూ. 100 కోట్లు కేటాయించింది. పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే హోం ఐసోలేషన్ కిట్ ఇస్తున్నాం. వారిని కోవిడ్ కేర్ సెంటర్స్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నాం’ అని శ్రీనివాసరావు తెలిపారు. మరి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పినట్టు కరోనా సెప్టెంబర్ చివరికల్లా తగ్గు ముఖం పట్టి ఆ తరువాత మటుమాయం అయిపోతే అంతకన్నా శుభవార్త ప్రజలకు ఇంకేం ఉంటుంది.
రెమ్డిస్‌విర్ ఇంజెక్షన్లు, ఫ్యాబిఫ్లూ, డెక్సామెథాసోన్‌ను అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు అంజేశామని..మెడికల్ మెరాకిల్‌గా డెక్సా పనిచేస్తుందని, అన్నిజిల్లాల్లో ఆర్టీపీపీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలుచేస్తూ పాజిటివ్ ఉన్నవారిని గుర్తిస్తున్నామని తెలిపారు. జిల్లాకో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా శ్రీనివాసరావు తెలిపారు.
జిల్లాల్లోని టీచింగ్ దవాఖానల్లో ఐసీయూ, ఐసొలేషన్ సౌకర్యాలు ఏర్పాటుచేశామని, సాధ్యమైనన్ని పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించే ఏర్పాట్లుచేస్తున్నట్టు వైద్యవిద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి చెప్పారు. 18 వేల పడకలకు ఆక్సిజన్ అందుబాటులోకి రానుందని రమేశ్‌రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
కాగా..కనీవినీ ఎరుగనటులవంటి మహమ్మారిని బారిని పడిన ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.దీని పీడా ఎప్పుడు విరగడ అవుతుందోనని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్తలు కరోనా ఆట కట్టించడానికి వ్యాక్సిన్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. వ్యాక్సిన్లు రావడం ఆలస్యం అవుతున్న కొద్దీ కరోనా మరింతగా వ్యాపిస్తోంది. కరోనా దెబ్బకు ప్రజా జీవితం భయం గుప్పిటలో బంధీ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా భీతావహ పరిస్థితులు నెలకొన్న ఇలాంటి సమయంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పిన ఈ మాట రాష్ట్ర ప్రజలకు పెద్ద శుభవార్త అని చెప్పక తప్పదు.