ఏపీ సీఎస్ స్క్రీనింగ్ టైమ్ : 14న కేబినెట్ మీటింగ్

  • Publish Date - May 9, 2019 / 02:37 AM IST

మే 14వ తేదీన జరిగే ఏపీ కేబినెట్ సమావేశానికి అంతా సిద్ధమవుతోంది. సీఎం కార్యాలయం నుంచి నోట్‌ అందుకున్న సీఎస్.. అధికారులను అలర్ట్ చేశారు. ఎలక్షన్ కోడ్ పరిధిలోకి రాకుండా ఉండేలా నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రికి బ్రీఫ్‌ చేసేందుకు ప్రిపేరై రావాలని అధికారులకు సూచించారు. అధికారుల నివేదికలపై చర్చించేందుకు సీఎస్ అధ్యక్షతన మే 09వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది.

రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, ఫోని తుపాను బాధితులకు సహాయం, ఉపాధి హామీ పథకం అమలు, తాగునీటి సమస్యపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన నోట్ ను అన్నిశాఖలకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం  పంపించారు. శాఖల వారీగా ఆయా అధికారులు ఇచ్చే నివేదికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

కేబినెట్ అజెండా అంశాలు ఎన్నికల కోడ్ క్రిందకు వస్తాయా? రావా అనేదానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఒకవేళ కోడ్ పరిధిలోకి వస్తే  అనుమతి కోసం సీఈవో ద్వివేది ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విషయాన్ని చేరవేస్తారు. అందుకే ఎలక్షన్ కోడ్ పరిధిలోకి రాకుండా నివేదికలు తయారు చేస్తున్నారు అధికారులు. వారిచ్చే నివేదికలు ఈసీ నిబంధనల మేరకు ఉన్నట్లయితేనే కేబినెట్ సమావేశానికి పచ్చజెండా ఊపే అవకాశం ఉంది.