ఫలించిన టీడీపీ వ్యూహం: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు

  • Publish Date - January 22, 2020 / 03:47 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని శానసమండలి నిర్ణయం తీసుకుంది. అత్యంత ఉత్కంఠ పరిణామాల మధ్య ఎట్టకేలకు బిల్లు సెలెక్ట్ కమిటీకి చేరుకుంది. సెలెక్ట్ కమిటీకి బిల్లు చేరుకోవడంతో బిల్లూ మూడు నెలలు పాటు పెండింగ్‌లో ఉండనుంది. 

శాసన మండలి ఛైర్మన్ నిర్ణయంపై టీడీపీ సభ్యులు హర్షం వ్యక్తం చెయ్యగా.. వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం సభ్యులు జై అమరావతి నినాదాలు చేస్తుండగా.. వైసీపీ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ బిల్లు సెలెక్ట్ కమిటీ బాట పట్టేలా మార్గం సుగమం చేశారు. వైసీపీ వ్యూహాలను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గంటన్నర పాటు శాసనమండలి గ్యాలరీలోనే ఉన్నారు. శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడంతో చంద్రబాబు అక్కడికి చేరుకుని వ్యూహాలు పన్నగా.. టీడీపీ ఎత్తగడలు చివరకు ఫలించాయి.