ఈ సీజన్‌లో సాయంత్రం అయ్యిందంటే చాలు.. మనపై దోమల దండయాత్ర మొదలవుతుంది. అంతేకాదు వాటితోపాటే వివిధ రకాల ప్రమాదకరమైన వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయి. వీటిని నివారించేందుకు ఇంట్లో మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే అది కొన్నిసార్లు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. అందుకే దోమలకు లార్వా స్టేజ్ లోనే చెక్ పెట్లేందుకు GHMC సులువైన మర్గాన్ని ఎంచుకుంది.
అదేంటంటే… చిన్న గోనె సంచిలో లేదా పాత దుస్తులలో రంపపు పొట్టు పోసి దాన్ని బంతిలా కట్టాలి. వాటిని ఓ రోజంతా (మస్కిటో లార్వాసీడిల్ ఆయిల్)లో నానబెట్టాలి. ఆ తర్వాత చెరువులో పడేస్తేసరి. అంతేకాదు వాడేసిన ఇంజిన్ ఆయిల్ లో ఈ బంతులను నానబెట్టి వేసినా ఫలితం ఉంటుంది.
ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్ లోనే సుమారు వెయ్యి కేసులు, 400లకు పైగా మలేరియా కేసులు నమోదయ్యాయి. హైటెక్ సిటీ చుట్టుపక్కల, మూసీ పరివాహక ప్రాంతాల్లో దోమల సమస్య ఎక్కువగా ఉంది. దీంతో GHMC 430 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. అంతేకాదు సుమారు వంద ఇళ్లవరకు దోమల నివారణ మందును పిచికారి చేయించింది.
దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు…
> నీటి నిల్వలు లేకుండా చూడటం.
> నివాస సముదాయాల్లో పెరిథ్రియం మందును. పిచికారి చేయడం.
> రోజుకు రెండుసార్లు ఫాగింగ్ చేయడం.
> నూనె బంతులు వేయడం.
సర్వే చేసిన విధానం:
సర్వేలో గుర్తించిన ప్రాంతాల్లో యాస్పిరేటర్ అనే యంత్రం ఏర్పాటు చేస్తారు. ఆ యంత్రం దోమలను ఆకట్టుకుంటుంది. అలా చిక్కిన దోమల్ని పరిశీలించి అవి ఏ వ్యాధి కారకాలో నిర్ధారించారు. ఇలా మొత్తం 1,08,449 ఇళ్లలో 10రోజులపాటు సర్వే చేశారు. 60శాతం క్యూలెక్స్ దోమలు, ఇంకా ఎనాఫిలిస్, ఎడిస్ ఈజిప్ట్ దోమలు ఉన్నట్లు తేల్చారు.