సీఎం జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి ప్రాంతాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఇవాళ(23 డిసెంబర్ 2019) నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు కోర్టు విధులను బహష్కరించాలని నిర్ణయించుకున్నారు హైకోర్టు న్యాయవాదులు.
ఈ మేరకు నిరసన తెలపాలంటూ అడ్వొకేట్స్ జేఏసీ తీర్మానించింది. ప్రతిరోజూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈనెల 24న ‘చలో హైకోర్టు’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఆదివారం విజయవాడలో నిర్వహించిన బెజవాడ బార్ అసోసియేషన్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు లాయర్లు. కృష్ణాజిల్లా బార్ ఫెడరేషన్ అధ్యక్షుడు పోపూరి లక్ష్మీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఫెడరేషన్ వివిధ జిల్లాల అధ్యక్షులు నరేంద్రబాబు(గుంటూరు), విజయకుమార్(పశ్చిమ గోదావరి), బొడ్డు భాస్కరరావు(ప్రకాశం), మణిరత్నం(నెల్లూరు), రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్‌కుమార్, సుంకర రాజేంద్రప్రసాద్‌లు హాజరయ్యారు.
ఈ సంధర్భంగా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడీషియరీ విభాగాలు మూడూ అమరావతిలోనే కొనసాగించాలని, ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఉద్యమం తీవ్రతరం చేయాలని తీర్మానించినట్లు చెప్పారు.