జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరో కీలక నేత షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమి నుంచి జనసేన ఇంకా తేరుకోక ముందే ఆ పార్టీకి వరుసగా కీలక నేతలు దూరం అవుతుండగా మరో నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు.
లేటెస్ట్ గా బుధవారం(02 అక్టోబర్ 2019) జనసేన పార్టీ నుంచి సీనియర్ నేత, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్ చైర్మన్ చింతల పార్థసారథి బయటకు వచ్చేశారు. తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి లేఖను జనసేన పార్టీ కార్యాలయానికి, అధినేతకు పంపించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన పార్థసారథి 6.67 శాతం ఓట్లు (82588 ఓట్లు) మాత్రమే తెచ్చుకుని ఓడిపోయారు. అయితే ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న చింతల పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.
ఇటీవలే కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్ పాలడుగు డేవిడ్ రాజు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరగా.. ఇప్పుడు చింతల ఏ పార్టీలో చేరుతారనే విషయంలో క్లారిటీ రాలేదు.