కర్ణాటక : హిందూ ఆలయానికి రక్షణగా ముస్లిం యువకుల మానవహారం

  • Publish Date - August 12, 2020 / 02:39 PM IST

భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం భారతదేశానికి ఆయువుపట్టు అని చెప్పాకతప్పదు. పలు సందర్బాల్లో ఇటువంటి మతసామర్యసం వెల్లివిరిసింది. అదే మరోసారి కర్ణాటకలోని డీజే హాళ్లిలో కనిపించింది. తమ మతాన్ని కించపరిచేలా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని ఓ వైపు ఆందోళన చేస్తూనే.. మరోవైపు హిందూ ఆలయానికి రక్షణగా నిలబడి మత సామరస్యాన్ని చాటారు కొంత మంది ముస్లిం యువకులు.

కర్ణాటకలోని డీజే హాళ్లిలో మంగళవారం రాత్రి నిరసనకారులు దాడికి పాల్పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ముస్లింలంతా హిందూ దేవాలయం చుట్టూ మానవ హారంగా నిలబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక వ్యక్తి కారణంగా రెండు మతాల మధ్య ఘర్షణకు దారి తీయకూడదనే ఉద్దేశ్యంతో ఇలా చేయడాన్ని ప్రశంసిస్తున్నారు.

ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి మేనల్లుడు ఒక వర్గాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టడంతో మంగళవారం (ఆగస్టు 11,2020) రాత్రి నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. వేలాది మంది బెంగళూరులోని ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కొన్ని వాహనాలకు నిప్పు పెట్టి రాళ్లు రువ్వారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ముగ్గురు నిరసనకారులు చనిపోయారు. 60 మంది పోలీసులు గాయపడ్డారు. 110మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి ఉద్రిక్త వాతావరణంలోనూ డీజే హాళ్లిలో ఉన్న ఓ హిందూ ఆలయానికి ఏమి జరగకుండా ముస్లిం యువకులు రక్షణగా నిలవడం ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు