కేరళలో వరద కష్టానికి బురద కూడా తోడైంది..బురదలో కూరుకుపోయిన ఇళ్లు

  • Publish Date - August 9, 2020 / 04:14 PM IST

కేరళాలో భారీ వర్షాలు కొట్టికురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజా జీవనం అస్తవ్యస్తం అయింది. ఓవైపు వరదలు..మరోవైపు వరద కష్టాలకు తోడు భారీగా బురద కూడా వచ్చి చేరుతుండటంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం సహాయక కార్యక్రమాలు.. కొనసాగుతున్నా మరోవైపు కరోనా భయం వెంటాడుతోంది.

గత కొన్ని రోజులుగా రాష్ట్రమంతటా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పెరియార్ నది పొంగి పొర్లడంతో అలువాలోని శివాలయం నీట మునిగింది. వరద నీటిలో ఓ భారీ ఏనుగు సైతం కొట్టుకుపోయింది. ఆలయం నీట మునిగి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా వరద ఉధృతి తగ్గడంలేదు.

గత రాత్రి వాయనాడ్ జిల్లాలోని సుగందగిరి అనే గిరిజన గ్రామంపై బురద మేటలు విరుచుకుపడ్డాయి. కొండ దిగువన గ్రామం ఉండటంతో కొండపై నుంచి బురద జారి ఇండ్లను కమ్మేసింది. బురదలో రెండు ఇళ్లు పూర్తిగా కూరుకుపోయాయి. ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించిన అధికారులు గ్రామస్తులను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఆస్తినష్టం జరగకపోయినా ప్రజలు మాత్రం కష్టాలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కడిక్కడ సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నా ప్రజల ఇక్కట్లు తప్పట్లేదు.