టీచర్ కాదు కీచక్ : చాటింగ్ చేయకపోతే ఫెయిల్ చేస్తా

తూర్పుగోదావరి : గురువు దైవంతో సమానం అంటారు. తల్లిదండ్రులతోనూ సమానంగా వారిని చూస్తారు. విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సి గురుతర బాధ్యత గురువుదే. కానీ కొందరు ఉపాధ్యాయలు పవిత్రమైన బోధన వృత్తికే కళంకం తెస్తున్నారు. పాఠాలు నేర్పాల్సిన టీచర్లు కీచకులుగా మారుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు.
సామర్లకోట వైఎల్ఆర్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ బాగోతం బయటపడింది. నాతో చాటింగ్ చేయకపోతే ఫెయిల్ చేస్తానని విద్యార్థిని బెదిరించిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. లెక్చరర్ పితాని నూకరాజు ఢిగ్రీ ఫస్టియర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. రోజూ తనతో చాటింగ్ చేయాలని టార్చర్ పెట్టాడని, లేదంటే మార్కులు తక్కువ వేస్తానని బెదిరించాడని బాధిత విద్యార్థిని వాపోయింది. బాధితురాలు సామర్లకోట పోలీసులను ఆశ్రయించింది. లెక్చరర్ నూకరాజు లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు లెక్చరర్ నూకరాజుపై కేసు నమోదు చేశారు. దర్యాఫ్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.