రామమందిరం కోసం 28ఏళ్లుగా ఆహారం తినటం మానేసిన ‘ఊర్మిళ’..భూమి పూజ చూసాకే దీక్ష విరమణ

  • Publish Date - August 2, 2020 / 11:41 AM IST

శ్రీరాముడు జన్మించిన అయోధ్యంలో రామమందిర నిర్మాణం కోసం ఎంతోమంది వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటువంటి రామ భక్తుల్లో ‘ఊర్మిళ’ది ప్రత్యేకమైన భక్తి అని చెప్పాలి. అయోధ్యలో శ్రీరాముడి మందిరం కోసం గత 28 ఏళ్లనుంచి ఆహారం తీసుకోకుండా బతుకుతోంది ఊర్మిళ. అంగరంగ వైభోగంగా జరుగనున్న ఈ వేడుక కోసం ఒళ్లంతా కళ్లు చేసుకుని..మనస్సంతా శ్రీరామ రూపాన్ని నింపుకుని శ్రీరామ నామ జపంతో వేయికళ్లతో ఎదురు చూస్తోంది ‘ఊర్మిళ’. శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడి భార్య పేరు కూడా ‘ఊర్మిళ’ అనే విషయం తెలిసిందే. ఆ ఊర్మిళ సీతా రామ లక్ష్మణులు వనవాసానికి వెళ్లి తిరిగి అయోధ్యకు వచ్చేంత వరకూ 14 సంవత్సరాల పాటు దీక్ష బూని తన మందిరం నుంచి బైటకు అడుగు పెట్టలేదు. దీక్షలోనే కాలం గడిపింది.



మధ్యప్రదేశ్ లోని బజల్ పూర్ లోని ఈ ఊర్మిళ మాత్రం అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం గత 28 సంవత్సరాలుగా ఆహారం తినటం మానివేసింది. భూమి పూజ పూర్తి అయిన తరువాతనే దీక్ష విరమిస్తానని అంటోంది. దశాబ్దాలుగా ఎన్నో ఆటంకాలను దాటుకుని దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆగస్టు 5న భూమి పూజ జరగనుంది. ఆ భూమి పూజను కళ్లారా చూసాకే తన దీక్షను విరమిస్తానంటోంది 81ఏళ్ల ఊర్మిళా చతుర్వేది.

28 సంవత్సరాల క్రితం రామాల‌య నిర్మాణం విష‌యంలో, వివాదం త‌లెత్తినప్పటి నుంచి మధ్యప్రదేశ్ లోని బజల్ పూర్ లోని ఈ ఊర్మిళ చతుర్వేది తాను రామాల‌య నిర్మాణం ప్రారంభమయ్యే వరకు అన్నం ముట్ట‌న‌ని ప్రతిజ్ఞ చేసింది. అది ఏదో సాధారణ విషయం అని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ తాను అన్న మాట ఊరికనే కాదని సంకల్ప బలంతోనే అనుకున్నానని నిరూపించారు ఊర్మిళా చతుర్వేది. అనాటి నుంచి ఆహారం తినకుండా కేవలం కొద్దిపాటి పండ్లు కొంచెం పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ గత 28 ఏళ్లనుంచి తనదీక్షను కొనసాగిస్తున్నారు.



ఈక్రమంలో ఎన్నో ఆటంకాలను దాటుకుని ఆగస్టు 5 న అయోధ్యలో శ్రీ రామాల‌య‌ నిర్మాణానికి భూమిపూజ జ‌రుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని ఊర్మిళ‌ చతుర్వేది తెలిపారు. 1992లో అయోధ్యలో అల్ల‌ర్లు చెల‌రేగిన స‌మ‌యంలో ఊర్మిళా చతుర్వేది వయసు 53 సంవత్సరాలు. ఈ ఘ‌ట‌న‌తో తీవ్రంగా క‌ల‌త చెందిన ఆమె అయోధ్యలో రామాల‌య నిర్మాణం జ‌రిగేవ‌ర‌కూ ముద్ద ముట్టేది లేద‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఆమె ఆరోగ్యం ఏమైపోతుందోనని భయపడిన కుటుంబ సభ్యులు ఆహారం తీసుకోవాలని ఒత్తిడి చేసినా ఆమె అన్నమాటకు కట్టుబడే ఉంది. కేవలం పండ్లు మాత్ర‌మే తింటూ, తమ ఇంట్లో రామ‌ద‌ర్బార్ ఏర్పాటు చేసుకుని..శ్రీ రామ్ శ్రీరామ్ అంటూ జపం చేసుకుంటూ కాలం గ‌డుపుతున్నారు. ఆగ‌స్టు 5న అయోధ్య‌లో జ‌రిగే ఆల‌య నిర్మాణ భూమి పూజ‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో చూసిన అనంత‌రం త‌న దీక్ష‌ను విర‌మిస్తాన‌ని ఊర్మిళ చతుర్వేది తెలిపారు.