ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత కేంద్రం తగు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కరోనాను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినీ హెల్త్ ఎమెర్జెన్సీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు పెరగడం, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కోవిడ్ అనుమానితుల సంఖ్య పెరగడంతో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం.
కరోనా నియంత్రణకు కేంద్రం సూచనల మేరకు బ్రిటిష్ కాలంనాటి 1897 చట్టాన్ని అమల్లోకి తీసుకుని వచ్చింది. ఈ చట్టానికి ‘ఆంధ్రప్రదేశ్ అంటువ్యాధి కొవిడ్-19 రెగ్యులేషన్ 2020’గా నామకరణం చేసింది ప్రభుత్వం. ఈ చట్టం శుక్రవారం(13 మార్చి 2020) రాష్ట్రం మొత్తం అమలులోకి వచ్చింది. ఇది ఏడాదిపాటు అమల్లో ఉండనుంది.
ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఆరోగ్యశాఖ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్ కమిషనర్‌కు అధికారాలు అప్పగించింది. జిల్లాస్థాయిలో కలెక్టర్, వైద్యాధికారి, బోధనాసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్లకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ చట్టం ప్రకారం విదేశాల నుంచి ఎవరైనా రాష్ట్రానికి వస్తే.. వారికి వ్యక్తులకు దగ్గు, జలుబు, శ్వాస సంబంధ వ్యాధులు లేకపోయినా 14 రోజుల పాటు ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉంచాలి. ఆ సమయంంలో కుటంబసభ్యులను, బయట వ్యక్తులను కలవడానికి వీల్లేదు. విదేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే.. కాల్ సెంటర్ 0866 2410978 నెంబర్‌కు లేదా 104 హెల్ప్ లైన్ నంబర్‌కు సమాచారం అందజేయాలి. దీనిపై హాస్పిటళ్లు కానీ, వ్యక్తులు కానీ, అధికారులు కానీ ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా మీడియాకు సమాచారం ఇవ్వకూడదు. నియమాలు అతిక్రమిస్తే శిక్షార్హులు.
ఈ చట్టం ప్రకారం కరోనా లక్షణాలున్న వారిని సెక్షన్-6 ప్రకారం సంబంధింత అధికారాలున్న వారు మాత్రమే చేర్చుకోవాలి. అనుమానితులు ఎవరైనా చికిత్సకు నిరాకరిస్తే అధికారులు బలవంతంగా వారిని ఆస్పత్రికి తీసుకుపోవచ్చు. ఒక ప్రదేశంలో కరోనా కేసు నమోదైతే ఆ ప్రాంతంపై జిల్లా కలెక్టర్‌కు కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
Also Read | కరోనా ఎఫెక్ట్ : ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం…పలు దేశాలకు విమానాలు రద్దు