SPY రెడ్డిపై సీబీఐ దాడికి ఆ రూ.500 కోట్లే కారణమా?

  • Publish Date - April 29, 2019 / 04:11 AM IST

నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్ధి, ఎస్‌పీవై రెడ్డి ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, నంద్యాల, కర్నూలులోని ఎస్‌పీవై రెడ్డి నివాసాల్లో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎస్‌పీవై రెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా పలు బ్యాంకుల దగ్గర 500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్లు ఆయనపై ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

ఎస్‌పీవై రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి తర్వాత టీడీపీ గూటికి చేరారు. అనంతరం ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన టికెట్ మీద నంద్యాల బరిలో దిగారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు.

ఎస్‌పీవై రెడ్డి నందీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో 500 కోట్ల రూపాయలను పలు బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆయనకు చెందిన గ్రూప్‌లో పీవీసీ పైపులు, సిమెంట్, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. వీటి ఆధారంగానే ఎస్‌పీవై రెడ్డి లోన్లు తీసుకోగా.. అవి తిరిగి చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎస్‌పీవై రెడ్డి ఇంట్లో సోదాలు జరిగిన సమయంలో ఆయన హాస్పిటల్లో ఉండగా.. అల్లుడు శ్రీధర్ రెడ్డి సమక్షంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.