రైతుల చుట్టూ రాజకీయం : నిజామాబాద్ పోలింగ్ నిర్వహణపై సందిగ్దత  

  • Publish Date - March 30, 2019 / 02:05 PM IST

నిజామాబాద్‌లో లోక్‌సభ ఎన్నికలను ఏ పద్దతిలో నిర్వహించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. బ్యాలెట్‌ ద్వారా నిర్వహించాలా లేక ఈవీఎమ్‌లు ఉపయోగించాలా అన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్‌కు ఇంకా 12 రోజులే సమయం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కోసం రాష్ట్ర అధికారులు ఎదురుచూస్తున్నారు.

ఒకరు కాదు ఇద్దరు కాదు… ఎన్నడూలేని విధంగా నిజామాబాద్ లోక్‌సభ బరిలో ఈసారి 185 మంది బరిలో నిలిచారు. పసుపు, ఎర్రజొన్నరైతులే పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఎన్నికల నిర్వహణ ఈసీకి తలనొప్పిగా మారింది.  బ్యాలెట్‌ ద్వారా పోలింగ్‌ నిర్వహించాలా.. లేక ఈవీఎమ్‌లతో నిర్వహించాలా అన్న దానిపై ఈసీ కి ఇంకా స్పృష్టత రాలేదు. అయితే బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, బ్యాలెట్‌ బాక్సుల తయారీ కన్నా ఎం-3 రకం ఈవీఎంలను సమీకరించడమే సులువు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ యంత్రాల ద్వారా 383 మంది అభ్యర్థులు పోటీ చేసినా ఎన్నిక సులువుగా నిర్వహించవచ్చు. 185 మంది బరిలో ఉన్నారు కాబట్టి ఒక్కో కంట్రోల్‌ యూనిట్‌కు 13 బ్యాలెట్‌ యంత్రాలను అమర్చి ఎన్నికల నిర్వహించవచ్చని.. ఈసీ అంచనావేసింది. ఇందుకోసం ఎం-3 రకం ఈవీఎమ్‌లపై అన్వేషణ మొదలుపెట్టింది. 

మరోవైపు బ్యాలెట్‌ పోలింగ్‌కే కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 2 నమూనాలు రూపొందించింది. 2 మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పుతో  పెద్ద పేపర్‌ను తయారు చేసింది ఈసీ. ఇది పెద్దగా ఉండటంతో ఒక పుస్తక రూపంలో మరో బ్యాలెట్‌ పత్రాన్ని తయారు చేశారు. పుస్తక రూపంలో ఉండే ఒక్కో పేజీలో సుమారు 8 గుర్తుల వరకు కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ పెద్ద పేజీ అయితే 2 లేదా 4 వరుసలు ఉండేలా ప్రింట్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో వాడుతున్న బ్యాలెట్‌ పెట్టెల పరిమాణం సరిపోయే పరిస్థితి లేదు. ఓ భారీ డ్రమ్ము సైజులో  బ్యాలెట్ బాక్స్ ను సిద్ధం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి బ్యాలెట్ బాక్సులు తయారీ చేసే వారి కోసం కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నిజమాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికలపై రానున్న రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.