ఇద్దరు గ్రామ వాలంటీర్‌‍ల ఆత్మహత్య: పింఛన్ డబ్బు వాడుకుని కట్టలేక ఒకరు

  • Publish Date - November 19, 2019 / 02:09 AM IST

పింఛను డబ్బును తన సొంత అవసరాలకు వాడుకుని, తిరిగి చెల్లంచలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు ఓ గ్రామ వాలంటీర్‌. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఓబుళదేవరచెరువు పంచాయతీ వేమారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బండి గోపినాథ్‌(25) గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్నాడు.

నవంబర్ ఒకటవ తేదీన గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌస్‌ సాహెబ్‌ గ్రామానికి చెందిన పింఛను డబ్బులు పంపిణీ చేయమని గోపినాథ్‌కు పని అప్పజెప్పాడు. పంపిణీ చేసిన తర్వాత మిగిలిన రూ.84,250లను తిరిగి కార్యాలయంలో ఇవ్వాలని చెప్పారు. అయితే ఆ మొత్తంను ఇవ్వకుండా కొద్ది రోజులుగా తాత్సారం చేస్తూ వచ్చాడు గోపీ నాథ్.

ఇదే విషయమై గోపీనాథ్‌ను తల్లిదండ్రుల సమక్షంలో నిలదీశాడు పంచాయతీ కార్యదర్శి గౌస్‌ సాహెబ్‌. డబ్బులు ఇవ్వకపోతే అధికారులు కేసు పెడతారని భయపడి గ్రామ సమీపంలోని సత్రంబావి వద్ద చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కదిరి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు గోపీనాథ్. పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామ పంచాయతీలో కూడా గ్రామవాలంటీర్‌ చుట్టుగుళ్ల రవికుమార్‌(28) ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. రవికుమార్‌కు తండ్రి లేడని, తల్లి ఉపాధి నిమిత్తం మస్కట్‌లో పనిచేస్తుందని స్థానికులు తెలిపారు. ఉదయం అంతా అందరితో కలిసి ఉన్న రవి కుమార్ సడెన్‌గా ఆత్మహత్య చేసుకున్నాడు. రవి కుమార్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.