10 మొక్కలు నాటితే తుపాకీ లైసెన్స్..పచ్చదనం కోసం పాటియాల కొత్త పద్ధతి

  • Publish Date - July 31, 2020 / 09:23 AM IST

మీకు తుపాకీ లైసెన్స్ కావాలా? దీని కోసం ఏమాత్రం కష్టపడక్కర్లేదు. కేవలం 10 మొక్కలు నాటితే చాలా ఘన్ కు లైసెన్స్ ఇచ్చేస్తామంటోంది పంజాబ్ ప్రభుత్వం. అదేంటీ మొక్కలు నాటితే తుపాకీ లైసెన్స్ ఇచ్చేస్తారా? ఇదేదో బాగుందే అనుకుంటున్నారా? మరి అంత ఈజీ రూల్ ను ఎందుకు పెట్టిందో..ఏంటో తెలుసుకుందాం..



పంజాబ్‌లోని పాటియాలా జిల్లా యంత్రాంగం ఈ కొత్త విధానానికి నాంది పలికింది. పది మొక్కలు నాటిన వారికే గన్ లైసెన్స్ ఇస్తామని ప్రకటించింది. ‘ట్రీస్ ఫర్ గన్స్’ విధానం ప్రకారం పాటియాలా ప్రజలు తుపాకీ లైసెన్స్ పొందడానికి 10 మొక్కలను నాటాలని కండిషన్ పెట్టింది. దీనిపై డివిజనల్ కమిషనర్ చందర్ గైండ్ మాట్లాడుతూ..పాటియాలాలో పచ్చదనాన్నిపెంచేందుకు ఈ విధానం ప్రవేశపెట్టినట్లు స్పష్టంచేశారు.

పత్తి మొక్కలు తప్పించి మిగిలిన ఏమొక్కలైనా సరే నాటవచ్చని తెలిపారు. మొక్కను నాటి వదిలేయకుండా ఆ నాటిన మొక్కలను ఒక నెల పాటు వాటికి క్రమం తప్పకుండా నీళ్లు పోసివాటి ఎదుగుదలకు తగిన చర్యలు తీసుకోవాలని వాటిని సంరక్షించాలని తెలిపారు. ఆ తరువాత ఆ మొక్కలతో కలిసి ఫోటో దిగి పంపాలని చెప్పారు. ఆ తర్వాతే తుపాకీ లైసెన్స్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం అవుతుందని చందర్ గైండ్ తెలిపారు.





పచ్చదనాన్ని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్తకొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షిచాలని చెబుతున్నాయి.నాటిన మొక్కలకు వేసే కంచెను కూడా ప్రభుత్వమే అందిస్తోంది. దీంతో కేవలం నాటిన మొక్కలకు నీళ్లు పోస్తే చాలు అవి చక్కగా ఏపుగా పెరిగిపోతాయి. పచ్చదనాన్ని పెంపొందించాలని..పది మొక్కలు నాటితేనే తుపాకీ లైసెన్స్ అందిస్తామని ప్రకటించింది పాటియాలా యంత్రాంగం.