ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షులు, ఇతర సభ్యులు ఎన్నికయ్యాక తొలిసారి ఆ పార్టీ నాయకులు ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని కలిశారు. పీసీసీ నూతన అధ్యక్షుడు శైలజానాధ్ రాహుల్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఊమెన్‌చాందీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మస్తాన్ వలీ కూడా రాహుల్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఏపీ అంటే తనకెంతో ఇష్టం, ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు. రాష్ర్టానికి ఎప్పుడు పిలిచినా వస్తానని వెల్లడించారు. ఏపీలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని, పూర్వవైభవం తీసుకురావాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల విధానం ప్రవేశపెడుతోందని, దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
జాతీయస్థాయిలో కూడా ఈ నిర్ణయంపై వ్యతిరేకత ఉందని, రాష్ట్రంలో ఈ విషయమై కాంగ్రెస్ పోరాడాలని సూచించారు. అమరావతి రాజధానిని యథాతథంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో అక్కడ రైతులు చేస్తున్న పోరాటానికి పార్టీ తరఫున పూర్తిగా మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రతీకార చర్యలు పక్కనపెట్టి, సుపరిపాలనపై దృష్టిపెట్టాలని, రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే కోరుకోవాలని ఆయనకు సూచించారు.