బైక్ ఇవ్వడమే తప్పయ్యింది: చెయ్యని తప్పుకు పోలీస్ స్టేషన్‌కు.. యువకుడి ఆత్మహత్య

  • Publish Date - December 30, 2019 / 01:48 AM IST

కొన్ని కొన్ని సార్లు చెయ్యని తప్పుకు బలవుతుంటారు. తప్పు చేయాలనే ఆలోచన లేని వ్యక్తులు తప్పు చేసినట్లు నిందపడితే తట్టుకోలేరు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కృష్ణా జిల్లా తాడేపల్లి పట్టణంలో కూడా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. సినిమాల్లో జరిగినట్లే చెయ్యని తప్పుకు చివరకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ చానెల్‌లో విలేకరిగా పనిచేస్తున్న తాడేపల్లి ముగ్గురోడ్డు ప్రాంతానికి చెందిన చరణ్‌రాజు తన బైక్‌ను విజయవాడలోని స్నేహితుడు శివ, అతనితోపాటు వచ్చిన మరో యువకుడికి డిసెంబర్ 24వ తేదీ రాత్రి ఇచ్చాడు. తర్వాత విజయవాడలో చర్చికి వెళ్లాడు. అయితే బైక్ తీసుకున్న ఇద్దరు స్నేహితులు బైక్‌పై విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఓ యువతిని ఈవ్‌టీజింగ్‌ చేశారు. ఆ యువతి వన్‌టౌన్‌ పోలీసులకు బైక్ నంబర్ చెప్పి ఫిర్యాదు చేసింది.

బైక్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు చరణ్‌ రాజును అదుపులోకి తీసుకోగా.. రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారణ చేశారు. ఈవ్‌ టీజింగ్‌ చేసింది చరణ్‌రాజు కాదని నిర్ధారించుకుని తర్వాత విడిచిపెట్టారు. చేయని తప్పుకు శిక్ష అనుభవించవలసి వచ్చిందని తీవ్ర మనస్తాపంకు గురైన చరణ్‌రాజు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.