విశాఖ ప్రచారంలో నేడు ముగ్గురు ముఖ్యమంత్రులు

  • Publish Date - March 31, 2019 / 01:39 AM IST

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచార హీట్ పెరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇవాళ(మార్చి 31, 2019) విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమంలో టీడీపీకి మద్దతు తెలిపేందుకు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్‌‌లు రానున్నారు. మోడీ విధానాలను ఎండగట్టేందుకు నడుం బిగించిన మమతా బెనర్జీ, కేజ్రివాల్ ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో సభలో మాట్లాడనున్నారు. 

ఈ క్రమంలో వన్‌టౌన్‌ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సాయంత్రం 5గంటలకు నిర్వహించే సభలో వారు ప్రచారం చేయనున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీ విశాఖలో నెలకొన్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. విభజన చట్టం, ఇతర హామీల అమలు కోసం కేంద్రంపై పోరాటం పేరుతో గతంలో ఢిల్లీలో చంద్రబాబు సభ నిర్వహించగా ఆ సభకు మమతా బెనర్జీ హాజరు కాలేకపోయింది. ఈ క్రమంలో తెలుగుదేశం నిర్వహిస్తున్న సభలో ఆమె పాల్గొంటుంది. దీంతో చంద్రబాబుతో కలిపి ఒకే స్టేజ్‌పై ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రసంగించడం ఆసక్తికరం అయింది.

విశాఖపట్నం లోక్‌సభకి టీడీపీ నుంచి మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి మనమడు శ్రీభరత్‌, వైసీపీ తరఫున సత్యనారాయణ, జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, భాజపా నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీ చేస్తుండడంతో విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో చతుర్మఖ పోటీ నెలకొంది.