అంచనాలు తలకిందులవుతున్నాయి. అభిప్రాయాలు తారుమారవుతున్నాయి. ఆలోచనలు అంతుపట్టడం లేదు. నియోజకవర్గాల్లో అనూహ్య పరిణామాలు, విచిత్ర పరిస్ధితులు .. ఇప్పుడు ఎక్కడ చూసినా..ఇదే టాపిక్…. ఓటర్ సైలెంట్. అంత..ఇంత..అంటూ..ఎవరెంత మొత్తుకున్నా, ఓటర్లు మాత్రం ఏం మాట్లాడటం లేదు. ఓటు ఎవరికి వేస్తారనేది కనిపెట్టడం విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు. అసలు ఏపీ ఓటర్ల చూపు ఎటు వైపు ఉందో అంతు పట్టక విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు.
పోలింగ్ తేదీ తరుముకొచ్చింది. ఓటు పడడానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. అయినా ఓటర్ల నాడి మాత్రం విశ్లేషకులకు కూడా అంతు చిక్కడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్ధితులు ఎదురవుతున్నాయి. క్షణానికో విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నిన్నటి వరకు ద్విముఖ పోటీ ఉన్న చోట ఇప్పుడు త్రిముఖ పోటీ కనిపిస్తోంది. నిన్నటి వరకు ఒకరికి విజయం దక్కుతుందని అంచనా వేసిన విశ్లేషకులకు.. మారిన పరిణామాలతో ఎవరికి ఎడ్జ్ అనేది చెప్పలేని పరిస్ధితి ఎదురవుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు ఓటింగ్ విషయంలో సైలెంట్‌గా ఉన్నారు. ఎవరు ఎంతగా తమ బలాల గురించి హోరెత్తించినా.. ఓటర్లు మాత్రం అందరినీ నిశితంగా పరిశీలిస్తున్నారే తప్ప .. నో రెస్పాన్స్. దీంతో ఎవరు ఎవరికి ఓటు వేస్తారనేది కనిపెట్టడం కష్టంగా మారింది.
పరిస్ధితులు భిన్నంగా ఉంటున్నాయి. ఒకటి రెండు చోట్ల తప్ప మిగిలిన అన్ని చోట్ల త్రిముఖ పోరు కనిపిస్తుండటంతో ఎవరి ఓట్లు ఎలా చీలతాయో. ఎవరు ఎవరివైపు మొగ్గు చూపుతారోనని ప్రతీ ఒక్కరిలో టెన్షన్ కనిపిస్తోంది. గడిచిన రెండు మూడు నెలలుగా ప్రభుత్వం పధకాల వల్ల లబ్ది పొందిన వారు కూడా పోలింగ్ రోజు ఎలా స్పందిస్తారనేది సందిగ్ధంగా ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతమన్న తేడా లేకుండా ఓటర్లు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. బాహాటంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. కనీసం ఎటు మొగ్గుచూపుతామన్న సంకేతాలూ ఇవ్వడం లేదు. మేనిఫెస్టోలు, అందులో ప్రస్తావించిన అంశాలను సైతం ఎవరూ మాట్లాడటం లేదు. సహజంగా ఎవరు గెలుస్తారు.. ఎంత మెజార్టీ అనే అంశాల జోలికి అసలు వెళ్లడం లేదు. దీంతో విశ్లేషకులు సైతం ఓటర్ల నాడి అందక తలపట్టుకుంటున్నారు.
అభ్యర్ధుల పనితీరు చూస్తున్నారా.. లేక వారి మంచితనం చూస్తున్నారా.. ఇంకా లేదంటే అభివృద్ధి చేసేవారిని సెలెక్ట్ చేస్తున్నారా అంటే అది కూడా అంతుపట్టడంలేదు. పోలింగ్ సమయం దగ్గరపడుతోంది. మరి విశ్లేషకుల మదిలో గుబులు పుట్టిస్తున్న ఓటర్లు మదిలో ఏముందో తెలియాలంటే మరి కొంత సమయం ఆగాల్సిందే.