ముద్రగడ దారెటు..?

  • Publish Date - March 17, 2019 / 05:23 AM IST

కాకినాడ: ఎన్నికల సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ  వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆయన పయనం ముందుకా….. వెనక్కా అనే చర్చ మొదలయ్యింది. క్రియాశీల రాజకీయాల్లో ఆయన ఉంటారా ? లేదా ? అన్నది మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం మీద పోరాటం చేసిన ఆయన తాజాగా ఆపార్టీ నేతలతో చర్చలు జరపడం ఆసక్తిగా మారాయి.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం… ఏపీలోని సీనియర్ నేతల్లో ఒకరు. 1978లో ఆయన తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాలుగుసార్లు ఎమ్మెల్యేగానూ, ఒకసారి ఎంపీగానూ గెలిచారు. కానీ గడిచిన రెండు ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2009లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. 2014లో ఇండిపెండెంట్ గా సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి పరాజయం చవి చూశారు.

వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని ముద్రగడ ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయనతో వైసీపీ నేతలు చర్చించారు. వైసీపీ పార్లమెంట్ సీట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపారు. టీడీపీ తరుపున కుటుంబరావు స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడతో భేటీ అయ్యారు. కానీ ముద్రగడ డిమాండ్లను నెరవేర్చే పరిస్థితి టీడీపీలో లేదని ప్రచారం సాగుతోంది. పిఠాపురం ఎమ్మెల్యే సీటుని కేటాయించేందుకు టీడీపీ నేతలు ముందుకొచ్చినప్పటికీ ముద్రగడ మాత్రం కాపు జేఏసీలోని మరికొందరు నేతలకు అవకాశం కావాలని పట్టుబట్టినట్టు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ వాటిలో మార్పులకు సిద్ధంగా లేకపోవడంతో ముద్రగడతో మంతనాలు ఫలించలేదని చెబుతున్నారు.

ముద్రగడ పద్మనాభం ఈసారి పోటీకి దూరంగా ఉండడంతో పాటు తటస్థంగా ఉండాలంటూ కాపు జేఏసీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. రాజకీయంగా కాపుల విషయంలో ఓవైపు పవన్ కల్యాణ్ బరిలో ఉన్న నేపథ్యంలో మరో పార్టీకి ముద్రగడ మద్దతు పలకడం శ్రేయస్కరం కాదనే వాదన వారి నుంచి వినిపిస్తోంది. అయినప్పటికీ ఈ సీనియర్‌ నేత సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరు కాబట్టి, చివరి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది అనూహ్యంగా ఉండవచ్చనే అంచనాలున్నాయి. దీంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత ఈసారి పోటీ చేస్తారా ? చేస్తే ఎక్కడ్నుంచి చేస్తారు ? లేక పోరుకు దూరమవుతారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ  ఎన్నికల్లో పోటీ చేస్తే తూర్పు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తప్పవని చెప్పవచ్చు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ముద్రగడ వైపు పడింది.