ఆళ్లగడ్డ: తన బిడ్డ జగన్ గతంలోనూ ఒంటరిగానే పోటీ చేశాడు, ఇప్పుడు ఒంటరిగానే పోటీ చేస్తున్నాడని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని వైసీపీ అధినేత జగన్ తల్లి వైఎస్ విజయమ్మ స్పృష్టం చేశారు. బీజేపీ తో నాలుగున్నరేళ్లు పొత్తుపెట్టుకున్న చంద్రబాబు గత ఎన్నికల్లో నేమో తల్లికాంగ్రెస్, పిల్లకాంగ్రెస్ అన్నాడు. ఇప్పుడేమో చంద్రబాబు రాహుల్ గాంధీతో కలిసి పోయి, జగన్.. బీజేపీ, కేసీఆర్ లతో కలిసామని అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని ఆవేదన వెలిబుచ్చారు. ఎన్నికల ప్రచార ముగింపు సభలో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా ఆళ్శగడ్డలో ఆమె మాట్లాడుతూ …జగన్ ఏ రోజు కూడా బీజేపీతోనూ కాంగ్రెస్తోనూ పొత్తు పెట్టుకోలేదని తెలిపారు.
కాంగ్రెస్ తో కలిసి జగన్ పై కేసులువేసి, జైలులో పెట్టించింది మీరు కాదా అని ఆమె చంద్రబాబు ను ప్రశ్నించారు. జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాడని, 16 నెలలు జైలులో పెట్టినా మిమ్మల్ని ఏమైనా అన్నాడా అని ఆమె అడిగారు. జగన్ కు ఓటేస్తే రాష్ట్రంలో అరాచకత్వమే అని చంద్రబాబు అంటున్నారు, నా కొడుకు ప్రేమను పంచేవాడే తప్ప రౌడీకాదని ఆమె చెప్పుకొచ్చారు. నా మామ రాజారెడ్డిని చంపిన వారికి ఆశ్రయం ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసునని విజయమ్మ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగవద్దని, 25 మంది ఎంపీలను గెలిపించుకుని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడదామని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు.