Drugs Smuggling: కడుపులో 2.22 కేజీల డ్రగ్స్.. ముంబై ఎయిర్‌పోర్టులో దొరికిన దొంగలు!

నిత్యం విమానాశ్రయాలలో అక్రమ మార్గాలలో బంగారం, డ్రగ్స్ రవాణా వెలుగులోకి వస్తూనే ఉంది. అధికారులు ప్రతి ప్రయాణికుడిని జల్లెడ పట్టి బయటకు పంపినా స్మగ్లర్స్ రోజుకో కొత్త మార్గాన్ని వెతికి ఈ రవాణా సాగిస్తున్నారు. లోదుస్తులు, వస్తువులలో దాచి వీటిని అధికారుల కళ్లుగప్పి రవాణా చేయడం పాత స్టైల్.

Drugs Smuggling: కడుపులో 2.22 కేజీల డ్రగ్స్.. ముంబై ఎయిర్‌పోర్టులో దొరికిన దొంగలు!

Drugs Smuggling

Drugs Smuggling: నిత్యం విమానాశ్రయాలలో అక్రమ మార్గాలలో బంగారం, డ్రగ్స్ రవాణా వెలుగులోకి వస్తూనే ఉంది. అధికారులు ప్రతి ప్రయాణికుడిని జల్లెడ పట్టి బయటకు పంపినా స్మగ్లర్స్ రోజుకో కొత్త మార్గాన్ని వెతికి ఈ రవాణా సాగిస్తున్నారు. లోదుస్తులు, వస్తువులలో దాచి వీటిని అధికారుల కళ్లుగప్పి రవాణా చేయడం పాత స్టైల్. కడుపులో దాచుకొని గమ్యానికి చేర్చడం కొత్త స్టైల్. ముఖ్యంగా డ్రగ్స్ స్మగ్లింగ్ కు ఇది ఉత్తమమార్గంగా ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. డ్రగ్స్ ను క్యాప్సూల్స్ గా మార్చి వాటిని కడుపులో పెట్టుకొని తరలిస్తున్నారు.

వాస్తవంగా ఈ పద్ధతిలో డ్రగ్స్ తరలించడం అనేది ఈ మధ్య విమానాశ్రయాలలో బయటపడుతుంది కానీ ఇలా కూడా చేస్తారని మన సినిమాలలో ఎప్పుడో చూపించారు. తెలుగులో కూడా డబ్బింగ్ అయిన హీరో సూర్య వీడొక్కడే సినిమాలో అచ్చం ఇలాంటి సన్నివేశం ఉంటుంది. హీరోతో పాటు మరికొందరు డ్రగ్స్ క్యాప్సూల్స్ తేనెలో ముంచుకొని మింగేస్తారు. మలేషియా వెళ్లిన తర్వాత ఏనీమా ఇచ్చి సరుకును బయటకు తీస్తారు. అలా డ్రగ్స్ తరలించినందుకు వారికి కొంత డబ్బు ఇస్తారు. ఆ డబ్బులకు ఆశపడే వారు ప్రాణాలకు తెగించి స్మగ్లింగ్ చేస్తుంటారు.

తాజాగా ముంబై విమానాశ్రయంలో అచ్చంగా వీడోక్కడే సినిమాలో సీన్ ను తలపించే స్మగ్లింగ్ ను అధికారులు ఛేదించారు. కడుపులో డ్రగ్స్ క్యాప్సూల్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు స్మగ్లర్స్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 22న ఇద్దరు టాంజానియా దేశస్థులు ముంబై ఎయిర్‌పోర్టుకు రాగా అధికారులు తనిఖీలు చేశారు. ఎక్కడా ఏం దొరకలేదు కానీ.. వారి ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది. బాగా నీరసించి పోయిన ఆ ఇద్దరినీ ఎయిర్‌పోర్టులోని స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షించగా పొట్టలో పెద్ద మొత్తంలో క్యాప్సుల్స్ కనిపించాయి.

అనంతరం క్యాప్సుల్స్ బయటకు తీసి చెక్ చేస్తే అందులో కొకైన్ ఉంది. మొత్తంగా ఆ ఇద్దరి పొట్టలో 2.22 కేజీల కొకైన్ ఉండగా దాని విలువ రూ.13.35 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు నిందితులను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచగా కోర్టు జ్యుడిషిల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం అధికారులు ఈ ఇద్దరి వెనకున్న డ్రగ్స్ మాఫియాను కనుగొనేందుకు విచారణ చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంతో ఎయిర్ పోర్ట్ అధికారులు మరింత భద్రత పెంచి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

Read: Jogulamba Gadwal: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం.. పరిహారంగా ఎకరం భూమి!